సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 మే 2020 (17:10 IST)

సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ విడుదల- 10, 12 తరగతి విద్యార్థులు ఇవి తప్పక తెచ్చుకోవాలి..

సీబీఎస్ఈ విద్యార్థులకు పరీక్షా తేదీలను ప్రకటించారు. సీబీఎస్ఈ పదో తరగతి, 12వ తరగతి పెండింగ్ పరీక్షల తేదీలను సీబీఎస్ఈ బోర్డు విడుదల చేసింది. కొత్తగా సవరించిన షెడ్యూల్ ప్రకారం జూలై 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్ అంటూ ట్విట్టర్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు.
 
గతంలో ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ బిల్లు కారణంగా హింసాత్మక ఘటనలు చెలరేగాయి. దీంతో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణకు ఇబ్బంది ఏర్పడింది. తాజాగా ఆ పరీక్షలకు కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా జులై 1న హోం సైన్స్ పరీక్ష జరగనుంది.

ఆ తర్వాత జులై 9న బిజినెస్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. అలాగే జులై 10న బయోటెక్నాలజీ పరీక్ష ఉంటుంది. జాగ్రఫీ పేపర్ జులై 11న ఉంటుంది. అలాగే ఫిజిక్స్ పేపర్ జులై 3న, అకౌంటెన్సీ పేపర్ జులై 4న, కెమెస్ట్రీ పేపర్ జులై 6న నిర్వహించనున్నారు.
 
మరోవైపు కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలకు కూడా షెడ్యూల్ విడుదలైంది. జులై 1న సోషల్ సైన్స్‌తో పరీక్షలు మొదలవుతాయి. చివరి పేపర్ ఇంగ్లీష్ వరకు తేదీలను ప్రకటించారు. అలాగే జులై 10 హిందీ, జులై 15న ఇంగ్లీష్ పేపర్ నిర్వహించనున్నారు.  
 
ఇంకా పరీక్ష రాసే విద్యార్థులు స్వయంగా శానిటైజర్లు తెచ్చుకోవాలని.. అది కూడా ట్రాన్స్‌పరెంట్ బాటిల్‌లో తేవాలని సీబీఎస్ఈ బోర్డు తెలిపింది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాల్సి వుంటుందని బోర్డు వెల్లడించింది. తల్లిదండ్రులు పిల్లలకు కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 
 
పరీక్షా సమయంలో అనారోగ్యం బారిన పడకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలని పేర్కొంది. జలుబు, దగ్గు వంటి లక్షణాలుంటే.. ఇతర విద్యార్థులకు సోకనీయకుండా వుండేందుకు తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని వెల్లడించింది. 
 
ఇంకా విద్యార్థులు అడ్మిట్ కార్డులు తెచ్చుకోవాలని, యాన్సర్ షీట్లు ఉదయం 10గంటల నుంచి 10.15 నిమిషాల లోపు పంపిణీ చేస్తారని.. ఆ తర్వాత 15 నిమిషాల పాటు ప్రశ్నా పత్రాన్ని చదివి 10.30 నిమిషాలకు పరీక్ష రాయడం ప్రారంభించాలని సీబీఎస్ఈ బోర్డు సోమవారం ప్రకటనలో వెల్లడించింది. ఈ ఇంకా పది, పన్నెండో తరగతుల షెడ్యూల్ తేదీలను సవివరంగా వెబ్ సైట్‌లో పొందుపరిచింది.