గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 మే 2020 (09:57 IST)

కోడి పిల్లల్ని కూడా వదలట్లేదు... కిలో చికెన్ ధర రూ.310

కరోనా లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమవుతున్నారు జనాలు. దీంతో రుచికరమైన వంటలపై దృష్టి పెడుతున్నారు. రోజు రోజుకి రుచికరమైన వంటలు చేసుకుని తింటూ కుటుంబంలో హాయిగా గడుపుతున్నారు. అలా జనాలు చికెన్ వంటకాలనే అధికంగా తీసుకుంటున్నారని తెలిసింది. 
 
కరోనా వైరస్‌కి చెక్ పెట్టాలంటే ప్రోటీన్ ఉండే మాంసం తినాలని ఆ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పడంతో ప్రజలు చికెన్ వంటకాలను బాగా లాగించేస్తున్నారు. దీన్ని అడ్డం పెట్టుకొని చికెన్ దుకాణాల వాళ్లు రేట్లు అమాంతం పెంచేశారు. కేజీ ఎంతంటే... ఏకంగా రూ.300 నుంచి రూ.310కి అమ్ముతున్నారు. దుకాణం దగ్గరకు వెళ్లాక ప్రజలు జేబులు తడుముకోవాల్సి వస్తోంది. 
 
మామూలుగా తెలంగాణలో రోజుకు 7.5 లక్షల కేజీల నుంచి 8 లక్షల కేజీల కోడి మాంసం అమ్ముతారు. ఆదివారం 24 లక్షల కేజీల దాకా అవుతుంది. లాక్‌డౌన్‌కు ముందు తెలంగాణలో నెలకు 4.20 కోట్ల కోడి పిల్లల్ని ఉత్పత్తి చేసేవారు. ఇప్పుడు వాటి సంఖ్య 2.8 కోట్లకు తగ్గింది. దాంతో... కోళ్లకు కొరత వచ్చింది. కోళ్ల కొరతకు తోడు ప్రజలు కూడా చికెన్ తింటే కరోనా రాదనే అభిప్రాయం పెంచుకొని... వీలైనప్పుడల్లా కొనుక్కుంటున్నారు.
 
దీనికి తోడు రంజాన్ రోజులు కావడంతో... అలా కూడా కోళ్లకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు తెలంగాణలో కోళ్ల ఫారాలు ఖాళీగా ఉన్నాయి. కోడి కేజీ కూడా పెరగకుండానే... అమ్ముడైపోతోంది. కోడి పిల్లల్నికూడా జనాలు వదలకుండా చికెన్ వంటకాలను తయారు చేసుకుని లాగించేస్తున్నారు.