నిజమే పైలట్ కనిపించడం లేదు.. గాలిస్తున్నాం : విదేశాంగ శాఖ
భారత వాయుసేనకు చెందిన ఓ పైలట్ కనిపించడం లేదని భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. అలాగే, మిగ్-21 జెట్ కనిపించకుండా పోయిందనీ విదేశాంగ కార్యదర్శి రవీష్ కుమార్ స్పష్టం చేశారు. అదేవిధంగా పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు తెలిపారు.
ఇదే అంశంపై బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, భారత వైమానికదళం నిర్వహించిన మెరుపుదాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ యుద్ధ విమానాలు భారత గగనతలంలోకి చొచ్చుకువచ్చి దాడులు చేసేందుకు ముఖ్యంగా, రక్షణ స్థావరాలపై దాడు చేసేందుకు ప్రయత్నించిందన్నారు. పాక్ యుద్ధ విమానాల రాకను ముందుగానే పసిగట్టిన భారత వైమానికి దళం.. వాటిని ప్రతిఘటించడంతో పాక్ యుద్ధ విమానాలు వెనక్కి తిరిగి వెళ్లిపోయాయని చెప్పారు. అయితే, ఎఫ్-16 రకం యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్టు చెప్పారు.
అదేసమయంలో భారత్ వాయుసేనకు చెందిన ఓ మిగ్-21 ఫైటర్ జెట్ కనిపించకుండా పోయిందని ఆయన చెప్పారు. అందులోని పైలట్ కూడా వెనక్కి రాలేదని తెలిపారు. ఆ పైలట్ తమ ఆధీనంలో ఉన్నట్లు పాకిస్థాన్ చెబుతున్నదని, అందులో ఎంత వరకు వాస్తవం ఉందో చూస్తామని రవీష్ కుమార్ చెప్పారు.
కాగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రతాండాలను లక్ష్యంగా చేసుకుని భారత వైమానికదళం మెరుపుదాడులు జరిపిందన్నారు. ఉగ్రవాదం నిర్మూలనలో భాగంగానే ఈ దాడులు చేశామనీ, ఈ దాడుల వల్ల ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి రవీష్ కుమార్ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్ ఉన్నారు.