కేసీఆర్ నెక్స్ట్ టార్గెట్.. రేవంత్ రెడ్డేనా? టిలో వేడెక్కిన పాలి'ట్రిక్స్'
తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్థులను ప్
తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ పార్టీలన్నీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అసెంబ్లీ రద్దు చేసిన రోజే 105 మంది అభ్యర్థులను ప్రకటించి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు సంచలనానికి తెరతీశారు. మరోవైపు అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ, ఉనికిని కాపాడుకోవాలనే తాపత్రయంతో తెలుగుదేశం పార్టీ పొత్తుకు సిద్ధమయ్యాయి. అయితే కొందరు నేతలు తెరాసను ఓడించాలంటే మహాకూటమి ఏర్పాటు కావాలంటూ సూచనలు ఇస్తున్నారు.
ఈ సూచనలను స్వీకరించిన కాంగ్రెస్ పెద్దలు మహాకూటమి ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. దీంతో మేల్కొన్న కేసీఆర్.. కాంగ్రెస్ నేతలకు చెక్ పెట్టే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఇందులోభాగంగా, ఆపద్ధర్మ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలపై గతంలో నమోదైన కేసులను తిరగదోడుతుందనే ప్రచారం జోరందుకుంది.
ఇప్పటికే కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి అరెస్టు.. గండ్ర సోదరులపై కేసు నమోదు చేశారు. ఇపుడు నెక్ట్స్ టార్గెట్ రేవంత్ రెడ్డే అయి ఉండవచ్చని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభపెడుతూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే.
2015 మే 30న వెలుగులోకి వచ్చిన ఓటుకు నోటు కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు కూడా వచ్చాయి. అంతేకాకుండా స్టీఫెన్‌సన్‌తో సాగిన సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్‌కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కూడా ఇచ్చింది. అయితే తర్వాత చోటు చేసుకున్న పరిణామాల అనంతరం రేవంత్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.
తాజాగా కాంగ్రెస్, టీడీపీలు పొత్తుకు సిద్ధపడుతుండటంతో రెండింటిని టార్గెట్ చేస్తూ.. ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకంగా మారిన రేవంత్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని వారు విశ్లేషిస్తున్నారు.