శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (16:47 IST)

వధువు తల్లితో వరుడి తండ్రి పరార్: ఔను వాళ్లిద్దరూ ఇప్పుడు తిరిగొచ్చారు

గుజరాత్ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో పెళ్లి జరుగుతుందనగా వధువు తల్లితో కలిసి వరుడు తండ్రి పరారైన సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో పెళ్లనగా వీరిద్దరూ జనవరి 3వ వారంలో జంప్ అయ్యారు. దీనితో పెళ్లి ఆగిపోయింది. 
 
లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే... పారిపోయిన ఓల్డ్ కపుల్ ఈ వాలెంటైన్ డే సందర్భంగా ఓ నిర్ణయానికి వచ్చారట. దాదాపు మూడు వారాల పాటు ఎక్కడో ఏకాంతంగా గడిపిన వీరిద్దరూ తిరిగి తమ కుటుంబ సభ్యుల వద్దకు వచ్చేయాలని నిర్ణయించుకుని సూరత్ తిరిగి వచ్చారు. 
 
ఇలా వచ్చినవారిలో వధువు తల్లికి చేదు అనుభవం ఎదురుకాగా వరుడు తండ్రికి మాత్రం ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. తిరిగి వచ్చిన వరుడు తండ్రికి అతడి భార్యాపిల్లలు ఎలాంటి కండిషన్లు పెట్టలేదు, ఏదో అలా జరిగిపోయిందంటూ సర్దుకున్నారు. కానీ వధువు తల్లిని చూసిన ఆమె భర్త కస్సున లేచాడు. ఎవరివద్దో వారాలు ఏకాంతంగా గడిపిన ఆమెను ఏలుకునేందుకు నేను సిద్ధంగా లేనంటూ ముఖం మీదే చెప్పేశాడు. 
 
ఆమె అతడితో లేచిపోయినప్పుడే తనకు ఆమెతో ఎలాంటి సంబంధం లేదని చెపుతున్నాడు. కాగా ఇలా పారిపోయిన కపుల్ 27 ఏళ్ల క్రితం ప్రేమికులట. అప్పట్లో వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో ఇలా ఇప్పుడు కలిసి జంప్ అయ్యారు. కానీ సమాజం అనేక రకాలుగా మాట్లాడుకుంటుండటంతో ఆ మాటలను తట్టుకోలేని ఈ జంట తిరిగి వచ్చేసింది. వధువు తల్లిని ఆమె భర్త అంగీకరించని నేపధ్యంలో ఆమె బాధ్యతను తనే చూసుకుంటానంటూ లేపుకెళ్లిన మాజీ ప్రేమికుడు చెప్పడం కొసమెరుపు.