పవన్ డోంట్ వర్రీ, నేనున్నా, ఆ నేత భరోసాతో రచ్చరచ్చ.. ఎవరు?
ఇసుక కొరతపై లాంగ్ మార్చ్ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధమైంది. వరుసగా భవన కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు జనసేన పార్టీ లాంగ్ మార్చ్‌ను చేపట్టింది. విశాఖ వేదికగా జరగబోయే ఈ లాంగ్ మార్చ్‌కు పెద్ద ఎత్తున జనసైనికులు తరలిరావాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే పిలుపునిచ్చారు.
అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీలెవరైనా సరే మద్ధతిస్తే తాము కలిసి ఆందోళన ఉదృతం చేయడానికి సిద్థమని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అయితే జనసేనానికి మొదట్లోనే ఎదురుదెబ్బ తగిలింది. సిపిఎం, సిపిఐ నేతలు మద్ధతు ఇవ్వలేదు. దాంతో పాటు విశాఖ జనసేన ఇన్‌ఛార్జ్ పసుపులేటి బాలరాజు ఉన్నఫలంగా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పార్టీలో చర్చ ప్రారంభమైంది.
అస్సలు జనసేనకు ఎవరూ సపోర్ట్ లేకపోవడంపై సర్వత్రా చర్చ జరగడంతో పాటు ఆ పార్టీ నేతల్లో కూడా ఆందోళన మొదలైంది. జనసైనికులు అస్సలు లాంగ్ మార్చ్ తరలివస్తారా.. రాకుంటే పరిస్థితి ఏంటని ఆందోళన చెందారు. అయితే ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నుంచి మద్ధతు ప్రకటించారు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు.
రేపు జరగబోయే లాంగ్ మార్చ్‌లో మా పార్టీ నేతలందరూ పాల్గొంటారని చంద్రబాబు పవన్ కళ్యాణ్‌కు చెప్పారు. దీంతో రాజకీయాల్లో తీవ్ర చర్చ ప్రారంభమైంది. ప్రతిపక్ష పార్టీలు కలిసి ప్రభుత్వంపై పోరాటం తీవ్రస్థాయిలో చేయడానికి సిద్ధమవ్వడం రాజకీయాల్లో మరింత చర్చకు దారితీస్తోంది. పవన్, చంద్రబాబు ఇద్దరూ ఇద్దరేనంటూ అప్పుడే సెటైర్లు ప్రారంభించారు అధికార పార్టీ నేతలు. అయితే ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకే తాము కలుస్తున్నామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా రెండు పార్టీలు కలిసి ఇసుక కొరతపై ముందుకు సాగడం స్థానికంగా చర్చకు రాష్ట్ర రాజకీయాల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.