ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేసీఆర్ గారిని కలుస్తా: పవన్ కళ్యాణ్

Pawan Kalyan
శ్రీ| Last Modified గురువారం, 31 అక్టోబరు 2019 (17:55 IST)
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి మాట్లాడుతానని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. సమస్య పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. గురువారం హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో టిఎస్ ఆర్టీసీ జె.ఎ.సి. నేతలు జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు.

గత 27 రోజులుగా జరుగుతున్న సమ్మె వివరాలను, తమ డిమాండ్లను వివరించారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపురించిందని, సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు. జె.ఎ.సి. నేతలతో చర్చించిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ... "నవంబర్ 3వ తేదీ భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించనున్నాం.

విశాఖపట్నం వెళ్లే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తాను. ఆయన్ని కలసి కార్మికుల సమస్యలు వివరిస్తాను. వారి 24 డిమాండ్లు శ్రీ కేసీఆర్ దృష్టిలో పెడతాను. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరపాలని, సానుకూలంగా స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని విన్నవిస్తాం. ఆయనతో మాట్లాడే అవకాశం రాని పక్షంలో కార్మిక నాయకుల భవిష్యత్ ప్రణాళికకు సంపూర్ణ మద్దతు తెలుపుతాం. కార్మికులతోపాటు వారి కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు పవన్ కళ్యాణ్.

27 రోజుల ఉద్యమంలో 16 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రానురాను సమస్య పీటముడిలా మారి కొలిక్కిరాకుండా పోయింది. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల మద్దతు, వారు చేసిన పోరాటం తీసిపారేయలేనివి. ఆర్టీసీ కార్మికుల బాధలు ప్రభుత్వ పెద్దలు అర్ధం చేసుకోవాలని కోరుతున్నాం అన్నారు. సోషలిస్ట్ డెమోక్రసీ విధానాన్ని అవలంభించే మన దేశంలో ప్రతి ఒక్కరికీ తమ బాధను చెప్పుకునే హక్కు ఉంటుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం అవసరం.
Pawan Kalyan

చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభించాలని కోరుకుంటున్నాం. 48 వేల మంది కార్మికులు మాత్రమే కాదు, వారి కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్ని వేల కుటుంబాలు ఆకలితో బాధ పడటం ఎవరికీ మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ హయాంలో బషీర్ బాగ్ కాల్పుల ఘటన జరిగిన సమయంలో రైతుల ఆవేదన ఎంతగా కలచివేసిందో, ప్రస్తుత సమస్య కుడా నన్ను అంతే కలచివేస్తోంది.

ఇప్పుడే సీఎం కెసిఆర్ గారి అపాయింట్ కోసం ప్రయత్నం చేస్తాను. సీఆర్ గారు దీనికి ఒక పరిష్కార మార్గం సూచించాలని కోరుతున్నాం. అంతా కష్టాల్లో ఉన్నారు. సామరస్యపూర్వకంగా ఓ రాజీ మార్గం వెతకాలి. ఓ మహిళా కండక్టర్ కూడా చనిపోవడం బాధ కలిగిస్తోంది. భవిష్యత్తు ఉండదన్న నిరాశ, నిస్పృహలకు గురైనప్పుడే బతుకు మీద ఆశ పోతుంది. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు. సమస్య పరిష్కారానికి మా వంతు కృషి మేం చేస్తాం అని అన్నారు పవన్ కళ్యాణ్.దీనిపై మరింత చదవండి :