1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (10:10 IST)

క్లీన్ ఇండియా : మహాబలిపురం బీచ్‌లో చెత్త శుభ్రం చేసిన మోడీ.. వీడియో వైరల్

నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించారు. ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఇపుడు క్లీన్ ఇండియా పేరుతో ప్లాస్టిక్‌ వాడకంపై నిషేధం విధించారు. అయితే, క్లీన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా, ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చెత్తను శుభ్రం చేశారు. 
 
అదీ కూడా సముద్రతీర ప్రాంతమైన మహాబలిపురం బీచ్‌లో ఆయన స్వయంగా తన చేతులతో చెత్తను శుభ్రం చేశారు. ఒక దేశ ప్రధానమంత్రి  స్థాయిలో ఉన్నాననే విషయాన్ని మరిచిపోయిన నరేంద్ర మోడీ.. చెత్తను ఏరివేయడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. పైగా, ఈ చర్య ఆయన నిరాడంబరతకు అద్దంపట్టింది. 
 
చైనా అధ్యక్షుడుతో చర్చల కోసం ఆయన మహాబలిపురం సముద్రతీర ప్రాంతంలో ఉన్న ఓ నక్షత్ర హోటల్‌లో శుక్రవారం రాత్రి బస చేశారు. శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచిన మోడీ... తన కాలకృత్యాలను తీర్చుకుని, వ్యాయామం చేశారు. ఆ తర్వాత ఎలాంటి భద్రతా సిబ్బంది లేకుండా సముద్ర తీరానికి చేరుకుని ఓ సాధారణ వ్యక్తిలా అరగంట పాటు కలియతిరిగారు. ఆసమయంలో తనకు కనిపించిన చెత్తను ఆయన స్వయంగా శుభ్రం చేశారు. బీచ్‌లో పడి ఉన్న ప్లాస్టిక్ కవర్లను, బాటిళ్లను ఆయన చెత్తో క్లీన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
 
ఆ తర్వాత తాను సేకరించిన చెత్తను ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఉంచి... హోటల్ సిబ్బంది జయరాజ్‌కు అప్పగించారు. "మన బహిరంగ ప్రదేశాలు శుభ్రంగా మరియు చక్కగా ఉండేలా చూద్దాం. మనం ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం" అంటూ మోడీ ట్వీట్ చేశారు. మోడీ ట్వీట్‌కు లక్షల్లో లైకులు వస్తున్నాయి. మీరు గ్రేట్ సార్ అంటూ.. నెటిజన్లు ఆయనను ప్రశంసంలతో ముంచెత్తుతున్నారు. ఆ వీడియోను మీరూ చూడండి.