శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (18:16 IST)

#MamallapuramSummit తమిళ పంచెకట్టులో మోడీ.. ద్వైపాక్షికంలోనూ సంప్రదాయానికి పెద్దపీట

భారత్ - చైనా దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు శుక్రవారం సాయంసంధ్యవేళలో ప్రారంభమయ్యాయి. తమిళనాడులోని సముద్రతీరప్రాంతమైన మహాబలిపురం ఇందుకు వేదికైంది. ఈ చర్చల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు పాల్గొన్నారు. వీరిద్దరూ వివిధ ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరుపనున్నారు. 
 
అయితే, ఈ చర్చల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ అచ్చం తమిళ పంచెకట్టులో కనిపించారు. అంటే.. ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లోనూ తమిళ సంప్రదాయానికి పెద్దపీటవేశారని చెప్పొచ్చు. ఫలితంగా పంచె, చొక్కా భుజాన కండువా ధరించారు. 
 
మరోవైపు, ఈ చర్చల కోసం బీజింగ్ నుంచి చెన్నైకు ప్రత్యేక విమానంలో చేరుకున్న చైనా అధ్యక్షుడికి ప్రధాని మోడీ మామల్లపురంలో ఘన స్వాగతం పలికారు.  అచ్చం ఓ తమిళుడిని తలపించే ఆహార్యంతో ఆయన జిన్‌పింగ్‌కు స్వాగతం పలికారు. మహాబలిపురంలోని అనేక చారిత్రక ప్రదేశాలతో పాటు యునెస్కో వారసత్వ కట్టడాలను కూడా జిన్ పింగ్‌కు దగ్గరుండి చూపించారు. 
 
అంతకుముందు.. భారత పర్యటన కోసం తమిళనాడులో అడుగుపెట్టిన జిన్‌పింగ్‌కు ప్రధాని మోడీ విందు ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్‌లో జిన్ పింగ్‌ను అచ్చెరువొందించేలా ప్రత్యేక వంటకాలతో మెనూ రూపొందించారు. ఈ మెనూలో ఎంతో పేరుగాంచిన తమిళ వంటకాలకు స్థానం కల్పించారు. 
 
కవణరాశి హల్వా, అరచవిట్ట సాంబారు, తక్కాల్ రసమ్ (టమోటా చారు), కడలాయ్ కుర్మా తదితర వంటకాలను జిన్ పింగ్‌కు వడ్డించనున్నారు. చెట్టినాడ్ వంటకాల నుంచి కారైక్కుడి ఆహార పదార్థాల వరకు జిన్ పింగ్ విందు భోజనంలో కొలువుదీరనున్నాయి.