శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2019 (10:59 IST)

చైనా భద్రతా సిబ్బంది ఆధీనంలో చెన్నై ఎయిర్‌పోర్టు

చెన్నై విమానాశ్రయాన్ని చైనా సిబ్బంది పూర్తిగా తమ ఆధీనంలో తీసుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శుక్రవారం భారత్‌కు రానున్నారు. భారత ప్రధానమంత్ర నరేంద్ర మోడీ, జీ జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశం సముద్రతీర ప్రాంతం మహాబలిపురంలో జరుగనుంది. 
 
ఈ సమావేశంలో పాల్గొనేందుకు జిన్‌పింగ్ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చెన్నైకు రానున్నారు. ఆయన రాక నేపథ్యంలో ముందుగానే చేరుకున్న చైనా దళాలు, చెన్నై విమానాశ్రయాన్ని అడుగడుగునా గాలించాయి. జిన్ పింగ్ ల్యాండ్ అయిన తర్వాత, ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంతో పాటు.. చెన్నై విమానాశ్రయాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయి. చైనా భద్రతాధికారులకు సీఆర్పీఎఫ్ దళాలు తమ సహకారాన్ని అందిస్తున్నాయి.
 
కాగా, జిన్ పింగ్ కోసం ప్రత్యేక కాన్వాయ్ ఇప్పటికే చెన్నై చేరుకుంది. అత్యాధునిక భద్రతా ప్రమాణాలు, బాంబు దాడులను తట్టుకునే సామర్థ్యంతో కూడిన నాలుగు ప్రత్యేక వాహనాలు రాగా, జిన్ పింగ్ ఏ వాహనంలో ప్రయాణిస్తారన్నది ఎవరికీ తెలియదు. అధ్యక్షుడి ప్రత్యేక భద్రతా దళం అధికారి చివరి క్షణంలోనే ఆయన ప్రయాణించాల్సిన కారును నిర్ణయిస్తారని సమాచారం.
 
ఎయిర్ పోర్టు నుంచి గిండి ప్రాంతంలోని స్టార్ హోటల్‌కు వెళ్లే ఆయన, తిరిగి తన కాన్వాయ్‌లోనే మహాబలిపురం చేరుకుంటారు. అక్కడికి ముందుగానే చేరుకోనున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలుకుతారు.