శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (09:49 IST)

#MamallapuramSummit వివాదాలతో నిమిత్తం లేకుండా..‌ నేడు మోడీ - జిన్‌పింగ్ చర్చలు

రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ శుక్రవారం భారత్‌కు వచ్చారు. ప్రత్యేక విమానంలో చెన్నైకు వచ్చిన ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి సముద్రతీరప్రాంతమైన మహాబలిపురానికి కారులో చేరుకున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ తమిళ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. 
 
తమిళ సంప్రదాయం ఉట్టిపడేలా ధోతీ, కండువా, తెల్లటి షర్టు ధరించిన ప్రధాని మోడీ... మహాబలిపురంలోని అర్జున తపస్సు స్మారకం వద్ద జిన్‌పింగ్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి చారిత్రక కట్టడాలు అర్జున తపస్సు, కృష్ణుడి వెన్నముద్ద రాయి, ఐదు రథాలు, షోర్‌ టెంపుల్‌ కాంప్లెక్స్‌ను జిన్‌పింగ్‌తో కలిసి సందర్శించారు. వాటి ప్రాశస్త్యాన్ని ఆయనకు వివరించారు. 
 
చైనాలోని ఫుజియాన్‌ రాష్ట్రంతో చారిత్రక సంబంధాలను కలిగిన ఈ తీరప్రాంత పట్టణంలో పల్లవులు నిర్మించిన ఏడో శతాబ్దం నాటి కట్టడాలను జిన్‌పింగ్‌ ఎంతో ఆసక్తిగా తిలకించారు. 'ఐదు రథాల కాంప్లెక్స్‌'లో 15 నిమిషాలపాటు సేద తీరిన ఇరువురు నేతలు కొబ్బరి నీళ్లు తాగుతూ కులాసాగా మాట్లాడుకున్నారు. అనంతరం షోర్‌ టెంపుల్‌ కాంప్లెక్స్‌ను (సముద్ర తీరప్రాంత ఆలయం) సందర్శించారు. ఇరుదేశాలకు చెందిన అధికారులతో కలిసి మోడీ, జిన్‌పింగ్‌.. షోర్‌ టెంపుల్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఆ తర్వాత షోర్‌ టెంపుల్‌ కాంప్లెక్స్‌లో శుక్రవారం రాత్రి చైనా అధ్యక్షుడి గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక విందు ఏర్పాట్లు చేశారు. ఇరు దేశాధినేతలిద్దరూ అక్కడే భోజనం చేశారు.
 
ఇదిలావుంటే, శనివారం ఉదయం మోడీ, జిన్‌పింగ్‌ ఏకాంతంగా చర్చలు జరుపనున్నారు. అనంతరం ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగనున్నాయి. ఇటీవల చైనాకు వచ్చిన పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో భేటీ అయిన రెండు రోజులకే ప్రధాని మోదీతో జిన్‌పింగ్‌ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉగ్రవాద నిరోధానికి సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం, సరిహద్దుల్లో రెండు దేశాల మిలిటరీ మధ్య సహకారాన్ని పెంపొందించుకునే అంశంపై ఇరువురు నేతలు చర్చలు జరుపనున్నారని అధికారులు పేర్కొన్నారు. 
 
గతేడాది ఏప్రిల్‌లో చైనాలోని వుహాన్‌లో ఇరువురి నేతల మధ్య తొలిసారి అనధికారిక భేటీ జరిగింది. కాగా, జిన్‌పింగ్‌కు ప్రధాని మోడీ నచియార్‌కోయిల్‌ దీపపు సెమ్మె, సరస్వతిదేవి తంజావూర్‌ పెయింటింగ్‌ను బహూకరించారు. భారత పర్యటన సందర్భంగా జిన్‌పింగ్‌.. హెలికాప్టర్‌ను కాదని ప్రత్యేకంగా చైనా నుంచి తెప్పించిన హాంగ్‌కీ అనే లగ్జరీ కారులో చెన్నై నుంచి మహాబలిపురం వెళ్లారు. హెలికాప్టర్లలో ప్రయాణించకూడదన్న తమ విధాన నిర్ణయమే ఇందుకు కారణమని  చైనా అధికారులుచె చెప్పారు.