గిన్నిస్ రికార్డ్ నెలకొల్పిన అమరావతి రోడ్డు.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ...?
కేంద్ర రోడ్డు రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ భారతదేశం తాజాగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పిందని ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యధిక పొడవైన రోడ్డును నిర్మించినందుకుగానూ ఈ ఘనత దక్కినట్లు ఆయన తెలిపారు. జాతీయ రహదారి 53ను 75 కిలోమీటర్ల మేర నిర్మించామనీ, ఈ రోడ్డు మహారాష్ట్రలోని అమరావతి- అకోలా జిల్లాల మధ్య వేసినట్లు చెప్పారు.
అమరావతి-అకోలా మధ్య 75 కిలోమీటర్ల మేర వేసిన రోడ్డు పనులు 105 గంటల 33 నిమిషాల వ్యవధిలో పూర్తయ్యాయి. 720 మంది కార్మికులు ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినట్లు రోడ్డు రవాణా- రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం తెలిపారు. జూన్ 3వ తేదీ ఉదయం 7:27 గంటలకు పనులు ప్రారంభించి జూన్ 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు పూర్తి చేసినట్లు మంత్రి వీడియో సందేశంలో తెలిపారు.
గతంలో ప్రపంచ రికార్డు ఖతార్‌లోని దోహాలో ఉంది. 27 ఫిబ్రవరి 2019న దోహాలో పబ్లిక్ వర్క్స్ అథారిటీ (ఖతార్) నిరంతరాయంగా వేయబడిన రోడ్డు మునుపటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఈ రోడ్డు పూర్తి చేయడానికి 10 రోజులు పట్టింది.