శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 16 అక్టోబరు 2019 (16:16 IST)

#AyodhyaHearing.. ముగియనున్న చివరి వాదనలు.. నవంబర్ 17న తీర్పుకు అంతా సిద్ధం

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో అయోధ్య భూవివాదం కేసులో చివరి వాదనలను జరుగనున్నాయి. ఈ మేరకు మంగళవారమే చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే 39 సార్లు అయోధ్య రామమందిరం బాబ్రీమసీదు భూవివాదంలో కోర్టు వాదనలు వింది.

ఇక చివరి సారిగా అంటే 40వ సారిగా అత్యున్నత న్యాయస్థానం వాదనలు విననుంది. దీంతో ఇక అయోధ్య భూవివాదంలో సుప్రీంకోర్టు కేవలం తీర్పు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ పొందేలోపు తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 
 
1992 డిసెంబర్ 6వ తేదీన 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదును కూల్చివేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఈ వివాదం హిందూ ముస్లింల మధ్య గొడవగా మారింది. అయితే అత్యున్నత న్యాయస్థానం మాత్రం అక్టోబర్ 17న వాదనలు వినేందుకు చివరిరోజని ప్రకటించింది.
 
ఇక అయోధ్య రామమందిరం కేసు విచారణలో ముస్లిం పార్టీలు సోమవారంతో తమ వాదనలను ముగించారు. బుధవారంతో ఇరుపక్షాల వాదనలను ముగించాలని సుప్రీంకోర్టు తన గడువును ఒకరోజు ముందుకు జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముస్లిం పార్టీల తరపున వాదించిన కౌన్సిల్ రాజీవ్ ధవన్ సుప్రీంకోర్టు బెంచ్ ముందు ఇబ్బందికరమైన ప్రశ్నను సంధించారు. 
 
న్యాయస్థానంలో అన్ని ప్రశ్నలను ముస్లిం పార్టీల తరపున వాదిస్తున్న తనపైనే ఎందుకు సంధిస్తున్నారు, ఈ కేసులు భాగమైన ఇతర పార్టీలను ఎందుకు వదిలేస్తున్నారని రాజీవ్ ప్రశ్నించడంతో కోర్టు దిగ్భ్రాంతికి గురైంది.  
 
రాజీవ్ వ్యాఖ్యలతో విభేదించిన సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్ ఇది అవాంఛిత ప్రకటన అని వాదించారు. కానీ ధావన్ దానికి తిరుగు సమాధానమిస్తూ తాను అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని కానీ అన్ని ప్రశ్నలూ తనపైకే ఎందుకు సంధిస్తున్నారన్నదే సమస్య అన్ని చెప్పారు.
 
రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించి బాబర్‌ చక్రవర్తి చారిత్రక తప్పిదం చేశారని.. దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని హిందూ పార్టీ సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర వాదనలు నెలకొన్నాయి. దేశ న్యాయచరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం కొనసాగిన అయోధ్య రామమందిరం కేసుపై నేటితో వాదనలు సోమవారం సాయంత్రం ఐదు గంటలతో ముగించి నవంబర్ 17 నాటికి తీర్పు ప్రకటించడానికి సుప్రీం కోర్టు సిద్ధమైన విషయం తెలిసిందే.