శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 14 అక్టోబరు 2019 (12:09 IST)

అయోధ్య కేసు: అసలు వివాదం ఏమిటి? సుప్రీం కోర్టు తీర్పు ఎప్పుడు వెలువడుతుంది?

అయోధ్యలో బాబ్రీ మసీదు విషయంలో హిందువులు, ముస్లింల మధ్య శతాబ్ద కాలానికి పైగా వివాదం నడుస్తోంది. 1992లో హిందువుల గుంపు మసీదును కూలగొట్టడంతో ఈ వివాదం విస్ఫోటనంగా మారింది. ఆ ఘటన నేపథ్యంలో జరిగిన మత అల్లర్లలో దేశవ్యాప్తంగా దాదాపు 2,000 మంది చనిపోయారు.

 
ఆ ఉదంతం తర్వాత అయోధ్యలోని భూమి మీద యాజమాన్యానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది. ఆ కేసులో 2010 సెప్టెంబర్ 30వ తేదీన తీర్పు ప్రకటించారు. కానీ, హిందువులు, ముస్లింలు సుప్రీంకోర్టులో అప్పీలు చేయటంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ తీర్పును సస్పెండ్ చేసింది. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నవంబర్‌లో తీర్పు వెలువడే అవకాశముంది. ఈ నేపథ్యంలో కేసు పూర్వాపరాలివీ...

 
1) అయోధ్య భూవివాదం కేసులో తీర్పు ఎప్పుడు రావచ్చు?
అయోధ్య భూవివాదం కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సారథ్యం వహిస్తున్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్ 2019 నవంబర్ 17వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో, ఈ కేసులో 2019 నవంబర్ 4 నుంచి 15వ తేదీ మధ్య తీర్పు రావచ్చని భావిస్తున్నారు.

 
నిబంధనల ప్రకారం.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి 65 ఏళ్ల వయసుకు రిటైర్ అవుతారు. సీజేఐ గొగోయ్ వయసు నవంబర్ 17వ తేదీన 65 ఏళ్లు దాటనుండటంతో ఆ రోజున ఆయన పదవీ విరమణ చేస్తారు. ఒకవేళ నవంబర్ 17వ తేదీ లోగా సీజేఐ గొగోయ్ సారథ్యంలోని ధర్మాసనం అయోధ్య భూవివాదం కేసులో తీర్పు ప్రకటించలేకపోతే.. ఈ అంశాన్ని కొత్త ధర్మాసనం విచారిస్తుంది. కానీ అలా జరిగే అవకాశాలు పెద్దగా కనిపించటం లేదు.

 
''సీజేఐ గొగోయ్ నవంబర్ 17వ తేదీన రిటైర్ అవుతున్నారు. ఆ రోజు ఆదివారం. ఆ ముందు రోజు శనివారం సుప్రీంకోర్టుకు సెలవు. కాబట్టి నవంబర్ 4 నుంచి 15వ తేదీ లోపు తీర్పు ప్రకటించే అవకాశం ఉందని మనం భావించవచ్చు'' అని మాజీ అదనపు సొలిసిటర్ జనరల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కె.సి.కౌశిక్ బీబీసీతో అన్నారు.

 
2) అయోధ్య భూవివాదం కేసు ఏమిటి?
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లా అయోధ్య నగరంలో ఒక భూభాగం కేంద్ర బిందువుగా ఉన్న వివాదానికి సంబంధించిన కేసు ఇది. హిందూ దేవుడైన రాముడి జన్మస్థలంగా హిందువులు పరిగణించే స్థలంతో పాటు.. బాబ్రీ మసీదు కూడా ఉన్న స్థలం ఇది. ప్రధానంగా ఈ స్థలాన్ని సందర్శించటానికి అనుమతి గురించిన వివాదం ఇది. అలాగే.. ఇక్కడ మసీదును నిర్మించటానికి అంతకుముందు ఉండిన హిందూ దేవాలయాన్ని కూల్చివేయటం లేదా మార్చివేయటం జరిగిందా అనే అంశం కూడా ఈ కేసులో ఇమిడి ఉంది.

 
బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6వ తేదీన ధ్వంసం చేశారు. ఆ ఉదంతం తర్వాత ఆ భూమి మీద యాజమాన్యానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది. ఆ కేసులో 2010 సెప్టెంబర్ 30వ తేదీన తీర్పు ప్రకటించారు. అలహాబాద్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు.. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించాలని.. అందులో ఒక భాగం హిందూ మహా సభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు వెళుతుందని తీర్పు చెప్పారు.

 
ఇటువంటి సున్నితమైన అంశం మీద నిర్ణయం తీసుకోవటం ఎంత కష్టమో కోర్టు తన ఉత్తర్వులో వివరించింది. ''ఈ చిన్న భూభాగం మీద అడుగుపెట్టటానికి దేవతలు కూడా భయపడతారు. దీని నిండా లెక్కలేనన్ని మందుపాతరలున్నాయి. దానిని మేం శుభ్రం చేయాల్సి ఉంది'' అని తీర్పు వ్యాఖ్యానించింది.

 
3) తీర్పు రోజున ఏం జరగవచ్చు?
ఆ భూమి ఎవరికి చెందుతుంది, ఏ భాగం ఎవరికి లభిస్తుంది అనే అంశం మీద స్పష్టతనిస్తూ సీజేఐ సారథ్యంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్తుంది. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా రాజ్యాంగ ధర్మాసనం సమర్థించవచ్చు. అలాగే.. అన్ని పక్షాలకూ ఉత్తమమని తాను భావించిన విధంగా ఆ భూభాగాన్ని రాజ్యాంగ ధర్మాసనం విభజించే అవకాశం కూడా ఉంది.

 
తీర్పు వెలువరించే రోజు ఐదుగురు న్యాయమూర్తులూ ధర్మాసనం మీదకు వచ్చి.. తీర్పులో తాము రాసిన భాగాన్ని ఒక్కొక్కరుగా చదివి వినిపిస్తారు. సీజేఐ స్వయంగా తీర్పు చదవటం ప్రారంభించే అవకాశముంది. ''తీర్పు రోజున కోర్టు హాలు కిక్కిరిసిపోతుంది. ఐదుగురు సభ్యులూ కోర్టు గదిలో వేదిక మీదకు వచ్చి తీర్పులో తాము రాసిన భాగాలను చదువుతారు. ఆ తర్వాత తమ చాంబర్లకు తిరిగి వెళతారు'' అని కౌశిక్ పేర్కొన్నారు.

 
అలహాబాద్ హైకోర్టు 2010 సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పులో మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పింది. వివాదాస్పద భూభాగం రాముడి జన్మస్థలమని చెప్పింది. అక్కడ ఉండిన ఒక దేవాలయాన్ని కూల్చివేసిన తర్వాత మసీదును నిర్మించారని పేర్కొంది. ఆ మసీదును ఇస్లాం సూత్రాలకు అనుగుణంగా నిర్మించలేదని తీర్పులో వ్యాఖ్యానించింది. ఆ తీర్పు అనంతరం... ఆ స్థలంలో ఆలయ నిర్మాణం జరుగుతుందని హిందువులు ఆశించారు. ముస్లింలు మసీదును పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. అయితే, 2010 నాటి తీర్పుకు వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు అప్పీలు చేయటంతో ఆ తీర్పును సుప్రీంకోర్టు 2011లో సస్పెండ్ చేసింది.

 
4) ఈ తీర్పు చెప్పబోయే న్యాయమూర్తులు ఎవరు?
అయోధ్య భూవివాదం కేసులో తీర్పు చెప్పబోయే ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సీజేఐ రంజన్ గొగోయ్ సారథ్యం వహిస్తారు. జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లు ధర్మాసనంలోని ఇతర నలుగురు సభ్యులు. ఈ కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ నజీర్ ఒక్కరే ముస్లిం న్యాయమూర్తి.

 
''ఈ న్యాయమూర్తులు మొదటి నుంచీ - ఆగస్టు 6వ తేదీ నుంచీ - రోజు వారీగా కేసును విచారిస్తున్నారు కనుక.. ఈ అంశం మీద ఈ న్యాయమూర్తులే తీర్పు చెప్పటం అభిలషణీయం'' అని సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ సూరత్‌సింగ్ బీబీసీతో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.

 
5) రామ మందిరం - బాబ్రీ మసీదు చరిత్ర ఏమిటి?
అయోధ్యలో బాబ్రీ మసీదు విషయంలో హిందువులు, ముస్లింల మధ్య శతాబ్ద కాలానికి పైగా వివాదం నడుస్తోంది. ఆ మసీదు నిర్మించిన స్థలం.. తమ దేవుడైన రాముడి జన్మస్థలమని.. 16వ శతాబ్దంలో ఓ ముస్లిం ఆక్రమణదారు అక్కడ ఉన్న ఒక హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ మసీదును నిర్మించారని హిందువులు వాదిస్తున్నారు.

 
ఆ మసీదులో 1949 వరకూ తాము ప్రార్థనలు చేశామని.. అయితే ఆ ఏడాది కొంతమంది రాత్రి వేళ చీకట్లో రాముడి విగ్రహాలను తెచ్చి ఆ మసీదులో పెట్టారని ముస్లింలు అంటున్నారు. ఆ తర్వాతే ఆ విగ్రహాలను పూజించటం మొదలైందని వాదిస్తున్నారు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాల పాటు ఈ భూభాగం తమకే చెందుతుందంటూ హిందూ, ముస్లిం గ్రూపులు అక్కడ ప్రార్థనలు చేసే హక్కుల కోసం కోర్టులకు వెళ్లాయి.

 
అయితే, 1992లో హిందువుల గుంపు మసీదును ధ్వంసం చేయటంతో ఈ వివాదం ఉద్ధృతమైంది. ఆ ఘటన నేపథ్యంలో జరిగిన మత అల్లర్లలో దేశవ్యాప్తంగా దాదాపు 2,000 మంది చనిపోయారు. అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పులో త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు హిందూ న్యాయమూర్తులు.. భారతదేశంలో మొఘలు సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ నిర్మించిన ఆ భవనం నిజానికి మసీదు కాదని.. పేర్కొన్నారు. కూల్చివేసిన హిందూ దేవాలయ స్థలంలో ''ఇస్లాం సూత్రాలకు వ్యతిరేకంగా'' దానిని నిర్మించారని వ్యాఖ్యానించారు. ఈ ధర్మాసనంలో ముస్లిం న్యాయమూర్తి ఈ అభిప్రాయంతో విభేదించారు. అక్కడ ఏ ఆలయాన్నీ ధ్వంసం చేయలేదని.. ఆ మసీదును శిథిలాల మీద నిర్మించారని ఆయన వాదించారు.

 
6) బాబ్రీ మసీదును ఎలా ధ్వంసం చేశారు? ఆ తర్వాత ఏం జరిగింది?
1992 డిసెంబర్ ఆరో తేదీన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)కి చెందిన హిందూ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), అనుబంధ సంస్థలకు చెందిన కొందరు నాయకులు.. 1,50,000 మంది కరసేవకుల (స్వచ్ఛంద కార్యకర్తల)తో అయోధ్యలోని ఈ వివాదాస్పద స్థలం దగ్గర ప్రదర్శన, సభ నిర్వహించినట్లు ఆరోపణ. ఆ ప్రదర్శన హింసాత్మకంగా మారింది. కరసేవకులు బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు. వారిని భద్రతా బలగాలు నియంత్రించలేకపోయాయి.

 
అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభను రద్దుచేసి రాష్ట్ర పాలనను తన ఆధీనంలోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 1993లో ఒక పాలనా ఉత్తర్వు ద్వారా మొత్తం 67.7 ఎకరాల విస్తీర్ణంలోని సదరు వివాదాస్పద స్థలాన్ని తన స్వాధీనం చేసుకుంది. అనంతరం బాబ్రీ మసీదు విధ్వంస ఘటన మీద విచారణ నిర్వహించగా.. పలువురు బీజేపీ, వీహెచ్‌పీ నాయకులు సహా 68 మందిని బాధ్యులుగా గుర్తించారు. ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.

 
ప్రస్తుతం.. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కల్యాణ్‌సింగ్, వినయ్ కటియార్, ఉమా భారతి తదితరుల ఆరోపిత పాత్ర మీద ప్రత్యేక సీబీఐ జడ్జి ఎస్.కె.యాదవ్ లక్నోలో విచారణ నిర్వహిస్తున్నారు. ''లక్నో సెషన్స్ కోర్టులో కొనసాగుతున్న బాబ్రీ మసీదు విధ్వంసం కేసు విచారణ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2020 ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తికావాలి'' అని కౌశిక్ బీబీసీతో అన్నారు.

 
అలాగే, లక్నోలోని విచారణ కోర్టు ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ఎస్.కె.యాదవ్ 2019 సెప్టెంబర్ 30వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన పదవీ కాలాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ పొడిగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని కూడా కౌశిక్ తెలిపారు.

 
7) అయోధ్యలో ఎంత మంది కరసేవకులు చనిపోయారు?
బాబ్రీ మసీదు విధ్వంసం సమయంలో 16 మంది కరసేవకులు చనిపోయారని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రికార్డులు చెప్తున్నాయని కౌశిక్ చెప్పారు. ఆ సంఘటన తర్వాత దేశ వ్యాప్తంగా జరిగిన అల్లర్లలో దాదాపు 2,000 మంది చనిపోయారు