ఐఎన్ఎక్స్ సొమ్ముతో విదేశాల్లో చిదంబరం ఆస్తులు... ఈడీ

chidambaram - karthi
Last Updated: బుధవారం, 21 ఆగస్టు 2019 (18:51 IST)
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో దోచుకున్న సొమ్ముతో మాజీ మంత్రి చిదంబరం విదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకున్నారనీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా, ఈ కుంభకోణంలో వచ్చిన సొమ్ముతో చిదంబరం కుమారుడు కార్తీ స్పెయిన్‌లో ఓ టెన్నిస్ క్లబ్బును, యూకేలో కాటేజీలను, భారత్‌తో పాటు ఇతర దేశాల్లో పలు ఆస్తులను కొన్నారని ఈడీ ఆరోపిస్తోంది. వీటి విలువ రూ.54 కోట్లకు పైగా ఉంటుందని చెబుతోంది.

ఈ కేసులో కార్తీతో పాటు చిదంబరం కూడా నిందితుడిగా ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్ సెల్-మ్యాక్సిస్ 2జీ కుంభకోణాలలో తండ్రి, కుమారుడిపై ఛార్జ్ షీట్లు నమోదయ్యాయి. ఇప్పటికే కొన్ని ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. అయితే, ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరంను ప్రధాన నిందితుడుగా ఢిల్లీ హైకోర్టు పేర్కొంటూ, ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

చిదంబరంకు ఝులక్ ఇచ్చిన సుప్రీంకోర్టు .. అరెస్టు కోసం వేట
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరంకు సుప్రీంకోర్టు ఝులక్ ఇచ్చింది. కోర్టు లిస్టులోకి పిటిషన్ వచ్చేంతవరకు దానిగురించి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మరోవైపు, చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు ఒకవైపు సీబీఐ, మరోవైపు ఈడీలు వేట కొనసాగిస్తున్నాయి. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరకు ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆయన అరెస్టు కోసం ఈడీ, సీబీఐ అధికారులు ప్రయత్నించగా, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఈ నేపథ్యంలో బుధవారం ముందస్తు బెయిల్ కోసం చిదంబరం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఇందుకోసం ఓ పిటిషన్‌ను రిజిస్ట్రార్‌కు అందజేశారు. అయితే, పిటిష‌న్‌లో లోపాలు ఉన్న‌ట్లు సుప్రీం గుర్తించింది. త‌ప్పులు లేకుండా మ‌రోసారి పిటిష‌న్ వేయాల‌ని చిదంబ‌రానికి చెందిన న్యాయ‌వాదుల‌ బృందానికి కోర్టు చెప్పింది.

మరోవైపు, లుకౌట్ నోటీసులు ఇవ్వ‌డం వ‌ల్ల చిదంబ‌రం ఇప్పుడు దేశం విడిచి వెళ్లే ప్ర‌స‌క్తే లేదు. బెయిల్ కావాల‌ని ఢిల్లీ కోర్టును ఆశ్ర‌యించినా.. ఆయ‌న‌కు అక్క‌డ ఊర‌ట ద‌క్క‌లేదు. చిదంబ‌రం పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను జ‌స్టిస్ ఎన్‌వీ ర‌మ‌ణ కొట్టిపారేశారు. సీనియ‌ర్ అడ్వ‌కేట్ క‌పిల్ సిబ‌ల్ బృందం న్యాయమూర్తిని ఎంత వేడుకున్నా ఆయ‌న విన‌లేదు.

అర్జెంట్‌గా కేసును స్వీక‌రించాల‌ని సిబ‌ల్ టీమ్ కోర్టును కోరింది. కానీ ఆ అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రించారు. చిదంబ‌రానికి ఊర‌ట ఇవ్వాల‌ని, ఒక‌వేళ ఆయ‌న్ను అరెస్టు చేస్తే, అప్పుడు ముంద‌స్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిష‌న్ వ్య‌ర్థ‌మ‌వుతుంద‌ని న్యాయ‌వాది సిబ‌ల్ కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీంకోర్టు కనికరించలేదు. దీంతో చిదంబరం అరెస్టు తప్పేలా లేదు.

చిదంబరం మెడకు ఐఎన్ఎక్స్ కేసు... అమిత్ షా ప్రతీకారమా?
కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం మెడకు ఐఎన్ఎక్స్ మీడియా కేసు చుట్టుకుంది. ఈ కేసులో ఆయన అరెస్టు ఖాయంగా కనిపిస్తోంది. పైగా, మంగళవారం రాత్రి నుంచి చిదంబరం కనిపించడం లేదు. దీంతో ఆయన కోసం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది.

అయితే, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను ప్రధాన నిందితుడుగా ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. పైగా, ఆయన్ను కస్టడీలోకి తీసుకుని విచారించాలని ఆదేశిస్తూ, ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. దీని వెనుక ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. దీన్ని కాంగ్రెస్ శ్రేణులు కూడా నిర్ధారిస్తున్నాయి. దీనికి వెనుక బలమైన కారణం లేకపోలేదు.

గతంలో యూపీఏ పదేళ్ళపాటు కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఆ సమయంలో కేంద్ర హోంమంత్రిగా పి. చిదంబరం ఉన్నారు. అప్పట్లో ఆయన కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తూ చక్రం తిప్పారు. ఆ సమయంలో గుజరాత్‌ హోంమంత్రిగా అమిత్ షా ఉన్నారు. ఈయన్ను పలు కేసుల్లో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్‌ చేయించి.. జైల్లో వేయించారు.

ముఖ్యంగా సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌లో అమిత్‌ షా హస్తముందని ఆరోపణలు వచ్చాయి. 2005 నవంబర్ 22వ తేదీన గుజరాత్ పోలీసులు సోహ్రాబుద్దీన్‌ను, ఆయన భార్య కౌసర్ బీని, మరో వ్యక్తిని పట్టుకుని కాల్చి చంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటన దేశ రాజకీయాల్లో ఇప్పటికే సంచలనమే. ఈ కేసులో అమిత్‌ షా మూడు నెలల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఆ తర్వాత ఆయనకు గుజరాత్‌ హైకోర్టులో బెయిలు మంజూరు కావడంతో బయటకు వచ్చారు.

ప్రస్తుతం కాలం మారిపోయింది. యూపీఏ అధికారం కోల్పోయింది. ప్రధాని మోడీ సారథ్యంలో బీజేపీ సర్కారు వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. తొలి ఐదేళ్ళ పాటు కేంద్ర హోం మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ ఉంటే, ప్రస్తుతం అమిత్ షా ఉన్నారు. ఇపుడు ఈయన ప్రతీకార చర్యలకు పూనుకున్నట్టు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఏదిఏమైనా పి.చిదంబరం అరెస్టు తథ్యంగా కనిపిస్తోంది.దీనిపై మరింత చదవండి :