ఆటోపై ఇల్లు.. ఆనంద్ మహింద్రా ఫిదా .. ఆర్కిటెక్ట్ వివరాలు కావాలంటూ...
చెన్నైకు చెందిన ఓ ఆర్కిటెక్ట్ ఆటోపై ఇల్లు నిర్మించారు. అదీకూడా లగ్జరీ ఇల్లు. ఈ ఆటో మొబైల్ హౌస్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పోస్ట్ చూసిన మహింద్రా గ్రూపు అధినేత ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు.. తమ సంస్థ తయారు చేసే బొలెరో వాహనంపై ఇలాంటి ఇల్లు తయారు చేస్తాడేమో తెలుసుకునేందుకు అతని వివరాలు ఎవరికైనా తెలిస్తే ఇవ్వాలంటూ తన ట్విట్టర్ ఖాతాలో అడిగాడు.
అసలు ఈ ఆటో మొబైల్ హౌస్ వివరాలను పరిశీలిస్తే, చెన్నైకి చెందిన అరుణ్ ప్రభు అనే ఆర్కిటెక్ట్ ఓ ఆటోపై లగ్జరీ ఇంటిని నిర్మించాడు. ఇది ప్రతి ఒక్కరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అరుణ్ ప్రభు ఏడాది క్రితం నిర్మించిన ఈ మొబైల్ హౌస్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ ఆటో మొబైల్ హౌస్‌లో ఒక చిన్న బెడ్ రూమ్, కిచెన్, లివింగ్ ఏరియా, బాత్‌రూమ్‌తో పాటు వర్కింగ్ ఎరియాకు కూడా గది ఉంది. అంతేకాదు ఈ ఇంటిపై ప్రభు 250 లీటర్ల వాటర్ ట్యాంకును కూడా ఏర్పాటు చేశాడు. ఈ మొబైల్ ఇంటిని నిర్మించడానికి అతడికి లక్ష రూపాయల వరకు ఖర్చయ్యిందట.
అది చూసి సామాన్య జనం నుంచి ప్రముఖులు వరకు అరుణ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర సైతం అరుణ్ పనితీరుకు ఫిదా అయిపోయారు. ఆదివారం ఆయన ట్వీట్ చేస్తూ.. 'చిన్న చిన్న స్థలాల్లోనూ నివాస సదుపాయాలు ఎలా ఎర్పరుచుకోవచ్చు అనేది అరుణ్ ప్రభు చేసి చూపించాడు.
అయితే త్వరలో అరుణ్ దృష్టి ఇంతకంటే పెద్ద ట్రెండ్‌పై పడాలనుకుంటున్నాను. బొలెరోపై కూడా ఇలాంటి ఇంటిని నిర్మిచగలడా అని నేను అతడిని అడగాలనుకుంటున్న. ఎవరైనా అతడి వివరాలను నాకు తెలుపగలరా' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఆటో మొబైల్ లగ్జరీ హౌస్, ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ సోషల్ మీడియాల వైరల్‌గా మారింది.