శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: బుధవారం, 26 జూన్ 2019 (14:18 IST)

చంద్రన్నా... మా ఇంటికి రా అన్నా... పిలుస్తున్న రాజధాని రైతులు...

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని కృష్ణా నది కరకట్టపై నివాసం వుంటున్న ఇంటిని కూడా కూల్చివేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అక్రమ కట్టడమని ఏపీ ప్రభుత్వం ప్రజా వేదికను కూల్చేసింది. దీని ప్రక్కనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వుంటున్నారు. ఇది కూడా అక్రమ నిర్మాణమేననీ, దాన్ని కూడా కూల్చేస్తామంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు చెపుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఉద్దండరాయుడిపల్లె గ్రామంలో పలువురు రైతులు చంద్రబాబు నాయుడికి ఇల్లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చంద్రన్నకు తాము ఇల్లు ఇచ్చేందుకు సిద్ధంగా వున్నామని వారు చెపుతున్నారు. కాగా అమరావతి సచివాలయానికి దగ్గరగా వున్న ప్రాంతంలో ఇంటిని చూసుకునేందుకు చంద్రబాబు నాయుడు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
 
మరోవైపు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రస్తుతం నేలమట్టం చేసిన ప్రజావేదిక ప్రక్కనే ఇల్లు ఉంది. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ఆయన సొంత నివాసం కాదన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ, కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటిని తొలగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందుకే తొలుత ప్రజా వేదికను కూల్చివేసినట్టు చెప్పారు. ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా సరే చట్టానికి లోబడి ఉండాలని ఆయన అన్నారు.
 
పైగా, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ఆయన సొంతిల్లేమి కాదన్నారు. ఆయన అనుచరుడినో.. తాబేదారునో పెట్టుకుని అదంతా ఆక్రమించుకున్నారన్నారు. ఈ విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారని చెప్పారు. చట్టానికి వ్యతిరేకంగా ఉంటే తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. సీఆర్డీయేలో చాలా అవినీతి జరిగిందన్నారు. సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల కోసం రూ.400 కోట్లతో ప్రారంభించి చివరకు రూ.700 కోట్లకు పెంచేశారని విమర్శించారు.