శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జనవరి 2020 (09:47 IST)

ఇరాన్‌తో యుద్ధం వద్దు : అమెరికాలో ఆందోళనలు

అమెరికా - ఇరాన్‌ దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా ఉంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొనివున్న ఉద్రిక్త పరిస్థితులను నిశితంగా పరిశీలించిన అంతర్జాతీయ యుద్ధ నిపుణులను ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇరాన్‌తో యుద్ధం వద్దంటూ అమెరికాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు చెందిన వివిధ సంస్థలు కలిసి శనివారం 70కి పైగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాయి. 
 
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ చర్యలను ఆందోళనకారులు ఖండించారు. ఇరాన్‌ మిలిటరీ కమాండర్‌ సులేమానీని హతమార్చడంతో పాటు పశ్చిమాసియాకు అదనంగా మూడు వేల మంది సైనికులను పంపాలన్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. 'పశ్చిమాసియా నుంచి అమెరికా బయటికి వస్తే తప్ప న్యాయం జరగదు, శాంతి నెలకొనదు' అంటూ నినదించారు. 
 
"ఇరాక్‌లో బాంబు దాడులు ఆపండి", 'అమెరికా దళాలు ఇరాక్‌ను వీడాలి' అంటూ షికాగోలోని ట్రంప్‌ స్క్వేర్‌ వద్ద 500 మందికిపైగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఇరాన్‌పై యుద్ధానికి ముగింపు పలకాలని, ఇరాక్‌లోని బలగాలను తక్షణమే వెనక్కి రప్పించాలని డిమాండ్‌ చేశారు. శ్వేతసౌధం ఎదుట, న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 
 
మరోవైపు, అమెరికా, ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఆదివారం భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జయశంకర్‌ ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌ జరీ్‌ఫతో ఫోన్‌లో మాట్లాడారు. రోజు రోజుకు ఉద్రిక్తతలు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
 
అలాగే, ఎవరిపైన ఎవరు దాడులు చేసేందుకూ తమ భూభాగాన్ని వాడుకోనివ్వబోమని పాకిస్థాన్‌ స్పష్టం చేసింది. ఇరాన్‌, అమెరికాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పాక్‌ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. 'పాకిస్థాన్‌ ఎవరికీ, దేనికీ భాగస్వామ్యపక్షం కాదు. కానీ, శాంతికి మాత్రం భాగస్వామి' అని ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ స్పష్టం చేసినట్టు ఆర్మీ అధికార ప్రతినిధి వెల్లడించారు.