సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 మార్చి 2018 (10:35 IST)

రాజ్యసభ ఎన్నికలు : దేశ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం...

రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం దేశ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.

రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం దేశ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. దేశ వ్యాప్తంగా ఖాళీ అయిన యాభై పైచిలుకు స్థానాలకు తిరిగి సభ్యులను ఎన్నుకునేందుకు వీలుగా ఈ పోలింగ్ నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నాయి. శాసనసభా కమిటీ హాలులోని కేంద్రంలో ఉదయం 9 గంటల ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. సాయంత్రం 5గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. మూడు స్థానాలకుగాను నలుగురు అభ్యర్థులు రంగంలో ఉన్నారు.  అన్ని స్థానాలూ గెలుస్తామని తెరాస ధీమాగా ఉంది. తెరాసకు మొత్తం 90మంది సభ్యులు ఉండగా, ఏడుగురు మజ్లిస్‌ సభ్యులు మద్దతు ప్రకటించారు.
 
పార్టీ అభ్యర్థులైన బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌కు 33, బడుగుల లింగయ్యయాదవ్‌కు 32, జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు 32 చొప్పున ఓట్లను పార్టీ కేటాయించింది. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా తెరాస మూడు రోజుల పాటు నమూనా పోలింగును నిర్వహించింది. ఐదుగురు సభ్యులున్న భాజపా, ఇద్దరు సభ్యులున్న తెదేపా, ఒక సభ్యుడున్న సీపీఎం ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. 
 
కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల సభ్యత్వం రద్దయింది. దీంతో మొత్తం పది ఓట్లు ఎన్నికల్లో తగ్గుతాయి. 109 మంది పోలింగులో పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో 97 మంది తెరాసకు మద్దతు ఇస్తుండగా.. 12మంది కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారు. ఇందులో తెదేపా నుంచి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌ రెడ్డి, స్వంతంత్య అభ్యర్థి దొంతి మాధవరెడ్డి ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వాస్తవ బలం 17కాగా ఇందులో ఏడుగురు తెరాసలో చేరారు. ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థి బలరామ్‌నాయక్‌కు ఓటు వేయాలని కాంగ్రెస్‌ విప్‌ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్థానాలు ఖాళీగా, ఈ మూడు స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.