ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఆగస్టు 2022 (16:23 IST)

మక్కా మసీదుకు తెలుగు యూట్యూబర్ వెళ్లాడు.. వివాదంలో చిక్కాడు..?

mecca mosque
తెలుగు యూట్యూబర్ మక్కా మసీదులోకి వెళ్లి వివాదంలో చిక్కుకున్నాడు. రవి తెలుగు ట్రావెలర్ (Ravi Telugu Traveler).. యూట్యూబ్‌లో ట్రావెలింగ్ వీడియోలు చూసే వారికి ఈయన సుపరిచితమైన వ్యక్తి. ఏపీలో విశాఖపట్టణానికి చెందిన ఆయన అమెరికాలో ఉద్యోగం చేస్తూనే.. దేశ విదేశాలు తిరుగుతుంటాడు. వాటిని వీడియోలు తీసి.. యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటాడు. ఇప్పటి వరకు 186 దేశాలు తిరిగానని.. మరే తెలుగు వ్యక్తి కూడా ఇన్ని దేశాల్లో పర్యటించలేదని రవి చెబుతుంటాడు. 
 
ఐతే అవన్నీ ప్రగల్భాలని.. రవి అన్ని దేశాలు తిరగలేదని తోటి యూట్యూబర్‌లు ఆరోపిస్తున్నారు. ఐతే రవి గతంలో ఓసారి మక్కా పర్యటనకు వెళ్లాడు. సౌదీ అరేబియాలో ఉన్న మక్కా మసీదులో కొన్ని కఠినమైన నిబంధనలు ఉంటాయి. అక్కడి చట్టాల ప్రకారం ముస్లిమేతర వ్యక్తులు మక్కాకు రావడం నిషిద్ధం.  
 
రవి కూడా మక్కా మసీదుకు వెళ్లి.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. తాను హిందువుని అయినప్పటికీ.. మక్కాలో వెళ్లగలిగానని.. ఇలాంటి ఫీట్ ఇంకెవరూ చేయలేరని గొప్పలు చెప్పుకున్నాడు. 
 
ఈ గొప్పలే ఇప్పుడు ఆయన్ను వివాదంలోకి నెట్టాయి. హిందువు అయి ఉండి మక్కా పర్యటించడం సౌదీ చట్టాలకు విరుద్ధమని.. ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. ఇంకా అతను క్షమాపణలు చెప్పాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫైర్ అవుతున్నాయి.