మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (19:01 IST)

ఉద్యోగుల వేతనాల్లో కోత... రిలయన్స్ ఇండస్ట్రీస్ :: కండిషన్స్ అప్లై

కరోనా వైరస్ అనేక రంగాలను వణికిస్తోంది. ఈ వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు వీలుగా దేశంలో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఈ లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక రంగం బాగా దెబ్బతింది. ప్రతి రంగంపైనా ఈ కరోనా వైరస్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆదాయం తగ్గిపోవడంతో ఏకంగా ప్రభుత్వాలే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించింది. ఇపుడు దేశ పారిశ్రామిక రంగానికి వెన్నెముకగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ప్రకటించింది.
 
అయితే, ఈ కోత కొన్ని వర్గాలకే మాత్రమే వర్తించనుంది. ముఖ్యంగా, వార్షిక వేతనం రూ.15 లక్షలు కన్నా తక్కువ ఉన్నవారికి కోతలు వర్తించవని సంస్థ తెలిపింది. వార్షిక వేతనం రూ.15 లక్షల కంటే ఎక్కువ వేతనాలు ఉంటే 10 శాతం కోత, బోర్డు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వేతనాల్లో 30 నుంచి 50 శాతం, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు, సీనియర్ లీడర్ల వేతనాల్లో 30 నుంచి 50 శాతం కోత అమలు చేయనున్నారు. 
 
ఇక, ఏడాదికి రూ.15 కోట్ల వరకు వేతనం అందుకునే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తన వార్షిక వేతనాన్ని పూర్తిగా వదులుకునేందుకు సిద్ధమయ్యారు. ఏది ఏమైనా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ తరహా నిర్ణయం తీసుకోవడంతో ఇతర పారిశ్రామిక దిగ్గజాలు కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.