గురువారం, 27 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 18 జూన్ 2024 (23:23 IST)

రుషి కొండపై ''సద్దాం హుస్సేన్ స్టైల్ ప్యాలెస్'': అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా? లేదా?: మాజీ మంత్రి రోజా ప్రశ్న

roja
రుషి కొండపై దాదాపు 10 ఎకరాల్లో నిర్మించిన నిర్మాణాలపై ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జాతీయ మీడియాలో అయితే... రుషి కొండపై సద్దాం హుస్సేన్ స్టైల్ ప్యాలెస్ కట్టారంటూ రిపబ్లికన్ టీవీ వంటి ఛానళ్లలో చర్చలను పతాకస్థాయికి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయి మీడియా ఛానళ్లు దాదాపు రుషి కొండ పైన వున్న ప్యాలెస్ తాలూకు వీడియోలను తమతమ ఛానళ్లలో ప్రసారం చేస్తూ చర్చలు నిర్వహిస్తున్నాయి.
 
ఇక అసలు విషయానికి వస్తే... మాజీ మంత్రి రోజా రుషికొండపై నిర్మించిన నిర్మాణాల గురించి తన ట్విట్టర్ హ్యాండిల్లో సుదీర్ఘమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఆమె అందులో ఇలా రాసుకొచ్చారు. ''రుషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా..? విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా..? వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా..?
 
2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రుషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా..? 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టాం... ఇందులో అక్రమం ఎక్కడుంది..? విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా, రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా..? ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా...? ఏడు బ్లాకుల్లో ఏమేమీ నిర్మాణాలు, వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన మాట వాస్తవం కాదా...?
 
హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా..? ఇన్నాళ్లూ ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా..? లేదా..? హైదరాబాద్ లో సొంతిల్లు కట్టుకున్నారని, హయత్ హోటల్ లో లక్షలకు లక్షలు ప్రజల డబ్బులను అద్దెలు చెల్లించిన వాళ్లా... ఈరోజు విమర్శలు చేసేది..? లేక్ వ్యూ గెస్ట్‌ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్ లలో 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లా ఈరోజు విమర్శలు చేసేది..?
 
మా వైఎస్ జగన్ అన్న పైన, మాపైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వైసిపి వెన్ను చూపేది లేదు... వెనకడుగు వేసేది లేదు..!! జై జగన్.'' అంటూ ముగించారు.