బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 నవంబరు 2021 (22:56 IST)

వీళ్లుండగా లోక్ సభ ఆకర్షణీయ పనిప్రదేశం ఎందుక్కాదన్న శశి: నెటిజన్లు ఫైర్

ఫోటో కర్టెసి-ట్విట్టర్
మహిళా ఎంపీలు వుండగా, లోక్ సభ ఆకర్షణీయ పనిప్రదేశం కాదని ఎవరన్నారు అంటూ పోస్ట్ పెట్టిన శశిథరూర్ పైన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... శశిథరూర్ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా నవంబర్ 29న పలువురు మహిళా పార్లమెంటు ఎంపీలతో సెల్ఫీ దిగారు.

 
ఈ సెల్ఫీలో సుప్రియా సూలె, ప్రణీత్ కౌర్, తమిజాచి తంగపాండియన్, మిమి చక్రవర్తి, సుస్రత్ జహాన్, జ్యోతిమణి వున్నారు. ఈ ఫోటోను శశిథరూర్ తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ... మహిళా ఎంపీలు వుండగా, లోక్ సభ ఆకర్షణీయ పనిప్రదేశం కాదని ఎవరన్నారు అంటూ కామెంట్ పెట్టారు. ఈ కామెంట్ చూసిన నెటిజన్లు మండిపడ్డారు.

 
మహిళలను ఆకర్షణీయమంటూ మాట్లాడి ఎంపీలను అగౌరవపరిచారంటూ అభ్యంతరం వ్యక్తం చేసారు. మహిళా సంఘాల నాయకులు సైతం శశిథరూర్ కామెంట్ పైన ఆగ్రహం తెలిపారు. ఐతే తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి వుంటే క్షమించాలంటూ శశిథరూర్ కోరారు. సెల్ఫీ దిగిన సందర్భంగా మహిళా ఎంపీలు ఏదో ఒకటి చెప్పండంటూ నన్ను అడిగితే దానికి సమాధానంగానే ఆ వ్యాఖ్య పెట్టాననీ, ఏదో ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదన్నారు.

 
మరోవైపు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల శశిథరూర్ వ్యాఖ్యలకు మద్దతు పలికారు. ప్రతి వ్యాఖ్యను భూతద్దంలో చూడాల్సిన పనిలేదన్నారు. పని వాతావరణం గురించి ఆయన చెప్పారనీ, మహిళలను కించపరచాలన్న ఉద్దేశ్యంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేయలేదని కితాబిచ్చారు.