శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 అక్టోబరు 2019 (06:37 IST)

ఇకపై సియాచిన్ పర్యాటక అందాలను తిలకించవచ్చు...

కేంద్ర ప్రభుత్వం మరో సాహసోపేత నిర్ణయం తీసుకుంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన 370 ఆర్టికల్ రద్దు చేసి చరిత్ర సృష్టించిన ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు.. ఇపుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 
 
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడివుందని మరోమారు పునరుద్ఘాటించింది. పైగా, సియాచిన్ ప్రాంతంలోకి పర్యాటకులను అనుమతించాలని తమ ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'లడఖ్‌ను పర్యాటక క్షేత్రంగా తీర్చదిద్దడానికి అవకాశాలున్నాయి. సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి కుమార్ పోస్టు వరకు ప్రాంతాలను ఇక నుంచి పర్యాటకులు సందర్శించవచ్చు' అని ప్రకటించారు. 
 
రాష్ట్రంలో 370 అధికరణ రద్దుతో పర్యాటకులు స్వేచ్ఛగా పర్యటించడానికి వీలుకలిగిందని చెప్పారు. సియాచిన్ ప్రాంతంలో అంతకు ముందు ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం ఆ భయం ఉండదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 
 
సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధ క్షేత్రంగా పేరుపొందిన విషయం తెల్సిందే. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పర్యాటకులు ఈ ప్రాంతంలో పర్యటిస్తూ.. మరపురాని అనుభూతులను సొంతం చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.