మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 7 ఏప్రియల్ 2018 (12:28 IST)

చాపకింద నీరులా తెలుగు నెటిజన్ల ప్రచారం ... కమలనాథులకు నిద్ర కరవు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించేందుకు అన్ని విపక్ష రాజకీయ పార్టీలతో పాటు... కర్ణ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించేందుకు అన్ని విపక్ష రాజకీయ పార్టీలతో పాటు... కర్ణాటకలోని తెలుగు ప్రజలు కూడా కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం లేకపోలేదు 
 
ఏపీకి ప్రత్యేక హోదా అంశం ఇపుడు జాతీయ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ వివాదమే కర్ణాటకలో బీజేపీ కొంప ముంచేలా కనిపిస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలులో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఏపీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దాని ప్రభావం ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారిపైనా ఉందని భావిస్తున్నారు. 
 
హోదా విషయంలో టీడీపీ ఎన్‌డీఏ కూటమి నుంచి బయటకు రావడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. అప్పటి నుంచి టీడీపీ-బీజేపీల మధ్య ఉప్పూనిప్పూ అన్నట్లు రగులుతోంది. మే నెలలో జరిగే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో దీని ప్రభావం కనిపించనుంది. ముఖ్యంగా ఏపీ సరిహద్దు జిల్లాల్లో ఎక్కువ మందికి ఆంధ్రా మూలాలతో ఇంకా సంబంధాలున్నాయి. 
 
వచ్చే ఎన్నికల్లో వీరిని బీజేపీకి ఓటేయకుండా చేయడమే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు కదులుతున్నాయి. తెలుగుదేశం నాయకత్వం నుంచి ప్రత్యేక ఆదేశాలేవీ లేకపోయినా సోషల్‌ మీడియా ద్వారా, సామాజికవర్గ సమావేశాల ద్వారా చాప కింద నీరులా ప్రచారం చేస్తున్నారు. మొత్తంమీద ప్రత్యేక హోదా అంశం కమలనాథుల కంటిపై కునుకులేకుండా చేస్తోంది.