గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2020 (11:39 IST)

ఎస్పీబీ హెల్త్ బులిటెన్ : గానగంధర్వుడికి మ్యూజిక్ థెరపీ

కరోనా వైరస్ బారిన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గానగంధర్వుడు, సినీ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. కరోనా వైరస్ కారణంగా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయన శ్వాసపీల్చడం కష్టంగామారింది. దీంతో ఎస్పీబీకి వెంటిలేటర్‌ అమర్చి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యోంలో ఏమాత్రం మెరుగుదల కనిపించలేదు. దీంతో జనరల్ ఐసీయు వార్డు నుంచి ప్రత్యేక ఐసీయు వార్డుకు తరలించి, నిపుణులతో కూడిన వైద్య బృందం చికిత్స చేస్తూ వస్తోంది.  
 
ఈ క్రమంలో ఎస్పీబీకి చికిత్స అందిస్తున్న వార్డులో ఆయన పాడిన పాటలను వైద్యులు ప్లే చేస్తున్నారట. అంటే.. ఎస్పీబీకి మ్యూజిక్ థెరపీ ఇస్తున్నారని ఓ తమిళ సినీ వెబ్‌సైట్ ఓ వార్తను ప్రచురించింది. ఆధాత్మిక, భక్తి పాటలతో పాటు డ్యూయెట్ పాటలను ప్లే చేస్తున్నారు. ఈ మ్యూజిక్ థెరపీ ద్వారా ఆయన కొంతమేరకు అయిన త్వరగా కోలుకుంటారని వైద్యులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, ఎస్.పి. బాలు ఈ నెల 13వ తేదీన చెన్నై చూలైమేడులోని ఎంజీఎం హెల్త్‌కేర్ ఆస్పత్రిలో కరోనా చికిత్స కోసం చేశారు. ఆ తర్వాత ఆయనకు శ్వాసపీల్చడం కష్టతరంగా మారడంతో ఆయన ఆరోగ్యం విషమంగా మారింది. ఎస్పీబీ ఈ గండం నుంచి గట్టెక్కాలనీ యావత్ సినీ లోకం ఆకాంక్షిస్తూ, తమతమ ఇష్ట దైవాలను ప్రార్థిస్తోంది.