బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 ఆగస్టు 2020 (22:36 IST)

ఆరోగ్యం విషమంగా ఉన్న మాట నిజమే కానీ.. డాడీ క్షేమం : ఎస్బీబీ తనయుడు

గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఇకలేరంటూ ఓ తమిళ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలను ఆయన కుమారుడు ఎస్.పి.చరణ్ ఖండించారు. నా నాన్న ఆరోగ్యంగా ఉన్నారని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అయితే, ఆయన ఆరోగ్యం కాస్త క్రిటికల్‌గానే ఉందనీ, అయితే, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ క్షేమంగానే ఉన్నట్టు ఆయన  తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, కరోనా వైరస్ బారినపడిన ఎస్బీబీ చెన్నై చూలైమేడులో ఉన్న ఎంజీఎం హెల్త్‌కేర్ అనే కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, గురువారం నుంచి ఆయన ఆరోగ్యం విషమించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన ఆరోగ్యంపై ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ వస్తోంది. 
 
ఈ క్రమంలో ఎస్పీ బాలు పరిస్థితి విషమం అంటూ మీడియాలో ప్రముఖంగా ప్రసారమైంది. అయితే తమిళ మీడియా సంస్థ 'పుదియతలైమురై' ఓ అడుగు ముందుకేసి ఎస్బీబీ ఇకలేరంటూ ఓ వార్తను ప్రసారం చేసింది. దీనిపై ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ స్పందించారు. తన తండ్రి ఆరోగ్యం గురించి పుదియతలైమురైలో వచ్చిన వార్త కరెక్ట్ కాదని స్పష్టంచేశారు.
 
ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న మాట నిజమే అయినా, ఎంజీఎం ఆసుపత్రి వైద్య నిపుణుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందుకుంటూ ఇప్పటివరకు భద్రంగానే ఉన్నారని వెల్లడించారు. కాస్త ఆలస్యమైనా సరే ఎస్పీబీ తప్పకుండా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తారని ధీమా వ్యక్తం చేశారు. తన తండ్రి ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ, ప్రార్థనలు చేస్తున్న వారికి ఎస్పీ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు.