బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: గురువారం, 29 ఆగస్టు 2019 (15:02 IST)

అద్దె ఇంటి కష్టాలు... తల్లి బ్రతికుండగానే శ్మశానానికి తరలించిన కొడుకు...

వృద్ధాప్య నరకం నుంచి కాపాడలేని వాడు పున్నామ నరకం ఎలా కాపాడుతాడు.? నవమాసాలు కని పెంచిన కన్నతల్లి అత్యంత కర్కశంగా బతికుండగానే కన్నకొడుకు చితి పేర్చేశాడు. తాను ఉంటుంది అద్దె ఇళ్లని చెబుతూ తల్లి చనిపోతే యజమానులతో మాట పడాల్సి వస్తుందని 90 ఏళ్ల వృద్ధమాతకు అమానవీయంగా చితి పేర్చాడు. వినడానికే చాలా దారుణంగా, అత్యంత దయనీయంగా ఉన్న ఈ ఘటన వివరాలు ఇలా వున్నాయి.
 
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలైన తన తల్లిని స్వయానా కన్నకొడుకు శ్మశానానికి చేర్చాడు. ఇది జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ విషయం చివరకు ఆనోటా ఈ నోటా పడి పోలీసులు, ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి చేరింది. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది, పోలీసులు... ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
జగిత్యాల వీక్లీ బజార్‌లో చెట్‌పల్లి నర్సమ్మ(95) అనారోగ్యంతో బాధపడుతూ వచ్చింది. ఈమె భర్త ముప్ఫయ్యేళ్ల క్రితమే చనిపోగా.. కుమారుడు ధర్మయ్య తల్లి ఆలనా పాలనా చూసుకుంటున్నాడు. తల్లి వృద్ధురాలు కావడంతో అనారోగ్యానికి గురైంది. ధర్మయ్య ఉండేది అద్దె ఇల్లు.. తల్లి ఇంట్లోనే చనిపోతే ఇంటి యజమానితో మాట పడాల్సి వస్తుందన్న భయంతో తల్లి కన్నుమూయక ముందే శ్మశానానికి తరలించాడు. 
 
అక్కడున్న ఓ గదిలో ఉంచాడు. వృద్ధురాలి దీనస్థితిని చూసి కొందరు చలించిపోయారు. జగిత్యాల ప్రభుత్వాసుపత్రి పర్యవేక్షకురాలు సుదక్షిణాదేవికి వారు సమాచారం అందించారు. వెంటనే ఆమె అంబులెన్స్‌ పంపించి ఆసుపత్రికి రప్పించారు. ప్రస్తుతం నర్సమ్మ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది.