శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 మార్చి 2022 (10:56 IST)

స్వామి శివానంద వీడియో వైరల్- మోదీకి పాదాభివందనం (video)

Sivananda
దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాదికి గాను మొత్తం 128 పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 పద్మ పురస్కారాల్లో నలుగురికి పద్మ విభూషణ్‌ ప్రకటించిన కేంద్రం..17 మందిని పద్మభూషణ్‌, 107 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.
 
విడతల వారీగా అవార్డుల ప్రదానం చేపట్టగా సోమవారం ఇద్దరికి పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 54 మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే అవార్డుల ప్రధానం సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
 
యోగా రంగంలో చేసిన విశేష కృషికి గాను 125 ఏళ్ల యోగా అభ్యాసకుడు స్వామి శివానందకు సోమవారం పద్మశ్రీ అవార్డు లభించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. శివానంద బహుశా దేశ చరిత్రలో అత్యంత ఎక్కువ వయసులో పద్మ అవార్డు గ్రహీతగా రికార్డులకెక్కారు. 
 
అయితే ఆయన అవార్డు అందుకున్న తీరుకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. పద‍్మ శ్రీ అవార్డు అందుకునే ముందు యోగా గురువు స్వామి శివానంద ప్రధాని నరేంద్ర మోదీకి పాదాభివందనం చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ సైతం ఆయనకు ప్రతి నమస్కారం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
 
అవార్డును అందుకునే సందర్భంగా స్వామి శివానంద.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కి కూడా పాదాభివందనం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రపతి కోవింద్ ప్రేమతో ఆయనను పైకి లేపారు. స్వామి శివానంద... మూడు దశాబ్దాలకు పైగా కాశీ ఘాట్‌‌లలో యోగాభ్యాసం, శిక్షణ ఇస్తున్నారు. నిరాడంబరమైన జీవనాన్ని గడుపుతూ..ఇప్పటికీ తన చుట్టూ పక్కల వారికి సేవ చేస్తున్నారు.
 
మరోవైపు, తెలంగాణకు చెందిన కిన్నెర మొగిలయ్య, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరిసింహారావు పద్మ శ్రీ అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు.