డిక్లరేషన్‌పై జగన్ సంతకం చేస్తారా? చేయరా? 23న తిరుమలకు ఏపీ సీఎం!
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం తిరుమల పర్యటనకురానున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
ముఖ్యమంత్రి జగన్ తిరుమల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్‌వో గోపినాథ్‌జెట్టి పరిశీలించారు. ఈ నేపథ్యంలో బేడి ఆంజనేయస్వామివారి ఆలయం నుండి శ్రీవారి ఆలయం వరకు, నాదనీరాజనం వేదిక వద్ద భద్రత ఇతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
గురువారం ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రులు వైఎస్.జగన్మోహన్ రెడ్డి, కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్.యడ్యూరప్ప నాదనీరాజనం వేదికపై సుందరకాండ పారాయణంలో పాల్గొంటారు. వేదికపై భద్రత, అలంకరణ, కార్యక్రమం నిర్వహించాల్సిన తీరుపై చర్చించారు. అనంతరం గోకులం విశ్రాంతి గృహంలోని సమావేశ మందిరంలో ఈ అంశంపై అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి టిటిడి అధికారులు, పండితులతో సమావేశం నిర్వహించారు.
అయితే, తిరుమలకు వచ్చే సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివుంది. ఎందుకంటే.. సీఎం జగన్మోహన్ రెడ్డి క్రైస్తవమతాన్ని అనుసరిస్తున్నారు. దీంతో సీఎం జగన్ కూడా ఖచ్చితంగా డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందేనంటూ హిందూ ధార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి.
అయితే, ఈ వ్యవహారంపై ఏపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ఇపుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అదేసమయంలో తితిదే కూడా డిక్లరేషన్‌పై సీఎంపై ఒత్తిడి చేయరాదని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేస్తారా? లేదా? అన్నది ఇపుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.