మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (10:35 IST)

కరోనా వైరస్‌కు కళ్లెం వేసే కొత్తరకం ఎన్95 మాస్క్

Mask
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తుంది. ఈ వైరస్ బారినపడి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో కూడా లక్షలాది మంది చనిపోయారు. ఈ వైరస్ నుంచి రక్షించేందుకు సరైన టీకా ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదు. అయితే, ఈ వైరస్ బారినపడకుండా ఉండేందుకు, ఒకవేళ వైరస్ సోకినా ప్రాణహాని లేకుండా ఉండేందుకు మాత్రం కరోనా టీకాలను అభివృద్ధి చేశారు. ఈ క్రమంలో కొవిడ్‌-19కు కళ్లెం వేసే కొత్తరకం ఎన్‌95 మాస్కును అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 
 
ఈ మాస్క్ వైరస్ వ్యాప్తిని తగ్గించడమే కాకుండా వైరస్‌ను చంపేస్తుంది. పైగా, ఈ మాస్కును ఎక్కువ కాలం వాడొచ్చు. ఎన్‌95 మాస్కుల్లో వాడే పాలీప్రొపలీన్‌ ఫిల్టర్లలోకి బ్రాడ్‌ స్పెక్ట్రమ్‌ యాంటీ మైక్రోబియల్‌ పాలీమర్లను విజయవంతంగా జోడించడం ద్వారా రెన్‌సెలీర్‌ పాలీటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌, మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. 
 
'ఎన్‌95లోని క్రియాశీల ఫిల్టరేషన్‌ పొరలు చాలా సున్నితమైనవి. అవి రసాయన మార్పుల ప్రభావానికి సులువుగా లోనవుతాయి. ఫలితంగా వాటి వడపోత సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ ఇబ్బందిని అధిగమించాలంటే ఈ మాస్కుల్లోని పోగుల కూర్పును మార్చాలి. దీనివల్ల శ్వాసకు ఇబ్బంది అవుతుంది' అని శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో తాము యాంటీబ్యాక్టీరియల్‌ సామర్థ్యం కలిగిన అమోనియం పాలీమర్లను ఈ పాలీప్రొపలీన్‌ పోగుల ఉపరితలానికి జోడించినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం అతినీలలోహిత కిరణాల సాయంతో గ్రాఫ్టింగ్‌ చేసినట్లు వివరించారు. ఈ మాస్కు.. తనమీద పడిన వైరస్‌ను చంపేస్తుందని పేర్కొన్నారు.