శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (13:50 IST)

రూ.52 లక్షలు కట్టించుకున్నారు.. ప్రాణం నిలబెట్టలేకపోయారు...

హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం పోయింది. కరోనా వైరస్ బారినపడిన ఓ మహిళకు వైద్యం చేసినందుకు ఏకంగా రూ.52 లక్షల బిల్లు కట్టించుకున్నారు. కానీ, ఆ మహిళ ప్రాణాలు మాత్రం కాపాడలేక పోయారు. దీంతో అటు డబ్బుతో పాటు.. ఇటు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే భార్యను పోగొట్టున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతమైన కొంపల్లికి చెందిన డాక్టర్‌ భావన(31)కు 15 నెలల కిందట అదే ప్రాంతానికి చెందిన డాక్టర్‌ కల్యాణ్‌తో వివాహమైంది. బేగంపేట సమీపంలోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో భావన రేడియాలజిస్టుగా పనిచేస్తున్నారు. అయితే, వివాహం తర్వాత తన వృత్తికి ఆమె దూరంగా ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో ఆమె ఇటీవల కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ఏప్రిల్‌ 22వ తేదీన భావనను సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. అక్కడ మే 6 వరకు చికిత్స పొందారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత ఏర్పడిన అనారోగ్య సమస్యల క్రమంలో.. ఎక్మో అవసరం కావడంతో జూబ్లీహిల్స్‌లోని మరో కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ 26 రోజులుగా అక్కడ చికిత్స అందించారు. అయితే, బుధవారం ఆమెకు అమర్చిన ఎక్మో పైపు సరిగా లేక రెండు నుంచి మూడు యూనిట్ల మేరకు రక్తస్రావమైవంది. దీన్ని ఆసుపత్రి సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. ఎక్మో సాయంతో ఆమె ఆక్సిజన్‌ స్థాయి 94గా ఉందని, తర్వాత పైపు సరిగా లేకపోవడంతో 64కు పడిపోయింది. 
 
అనంతరం ఫ్లూయిడ్‌ ఓవర్‌లోడ్‌ చేయడంతో గురువారం వేకువజామున 4.30 గంటల సమయంలో ఆమెకు గుండెపోటు వచ్చి చనిపోయింది. ఈ వైద్య సేవల కోసం ఏకంగా రూ.52 లక్షలను ఆస్పత్రికి చెల్లించారు. మరో రెండు వారాల్లో డిశ్చార్జి కావాల్సి వుండగా, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తన భార్య ప్రాణాలు కోల్పోయిందని పేర్కొంటూ కళ్యాణ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అయితే, ఆస్పత్రి యాజమాన్యం మాత్రం మరోలా స్పందిస్తోంది. ఈ ఘటనలో వైద్యులు, వైద్య సిబ్బంది వైఫల్యమేమీ లేదని, విషమ పరిస్థితిలో ఉన్న ఆమెను బతికించడానికి విశ్వ ప్రయత్నాలు చేశామనీ, చివరకు ఫలితం లేకపోయిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరి ఈ ఫిర్యాదుపై పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.