శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 డిశెంబరు 2019 (14:55 IST)

రూ.లక్షల కోట్లు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేం... అందుకే : సీఎం జగన్

ఏపీ మంత్రివర్గ సమావేశం శుక్రవారం అమరావతిలో జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రాజధాని తరలింపుపై తన మనసులోని మాటను మరోమారు స్పష్టం చేశారు. లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేమన్నారు. కానీ, ఆ రూ.లక్ష కోట్లలో పది శాతం నిధులు వెచ్చించినా విశాఖపట్టణంను మహానగరంగా అభివృద్ధి చేయగలమని వెల్లడించారు. దీంతో రాజధాని తరలింపు తథ్యమని తేలిపోయింది. 
 
రాజధాని అమరావతి అంశంపై గందరగోళం నెలకొనివున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వెలగపూడిలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. రాజధాని తరలింపుపై మంత్రివర్గ సమావేశంలో అరగంటపాటు సీఎం జగన్ మంత్రులకు వివరించారు. ఎన్ని వేల కోట్లు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేమని వారికి చెప్పారు. 
 
రూ.లక్ష కోట్లలో పదిశాతం విశాఖలో ఖర్చుపెట్టినా హైదరాబాద్‌ స్థాయిలో రాజధాని అభివృద్ధి అవుతుందని సీఎం వివరించారు. రాజధాని మార్పు ఎందుకు, ఏమిటో ప్రజలకు చెప్పి చేద్దామని జగన్‌ మంత్రులతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. రాజధాని తరలింపుపై తొందరపాటు లేదని సీఎం జగన్‌ అభిప్రాయపడినట్లు సమాచారం. రూ.లక్ష కోట్లు పెట్టే ఆర్థిక స్థోమత ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని, అందులో పది శాతం విశాఖపై ఖర్చు పెట్టినా ప్రపంచ స్థాయిలో రాజధాని ఉంటుందన్నారు. 
 
మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ చేసిన ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే.. రాజధాని మార్పు ఖాయమేనని స్పష్టమైంది. అయితే.. మార్చే ముందు కొత్త సరంజామా సిద్ధం చేస్తున్నారన్న విషయం తేటతెల్లమైంది. ఇన్నాళ్లూ తాము చేస్తున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై మరింత ముందుకు వెళ్లేందుకు వైసీపీ సర్కార్ సన్నాహాలు మొదలుపెట్టింది. విచారణకు ఆదేశించే వ్యూహంపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. అలాగే రాజధాని తరలింపు అంశంపై న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై కూడా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది.