మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

దేశ భద్రత రహస్యాలు పాకిస్థాన్‌కు.. గూఢచర్య రాకెట్‌ గుట్టురట్టు

సామాజిక మాధ్యమాల్లో అందమైన అమ్మాయిలు పలకరించగానే వాళ్లు పరవశించిపోయారు. అమ్మాయిలు విసిరిన వలపువలలో చిక్కుకున్నారు. వారి తియ్యటి మాటలకు తోడు.. భారీ మొత్తంలో హవాలా ద్వారా అందించే సొమ్ముకు ఆశపడ్డారు. ఏకంగా దేశభద్రతనే ఫణంగా పెట్టి రహస్యాలను వారికి అందించారు. వలపువల విసిరింది పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ వాళ్లు కాగా.. దానికి చిక్కుకున్నది భారతదేశ నౌకాదళ సిబ్బంది. ఈ గూఢచర్య రాకెట్‌ను ఆంధ్రప్రదేశ్‌ నిఘా విభాగానికి చెందిన కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం బట్టబయలు చేసింది. కేంద్ర, నౌకదళ నిఘావిభాగాల సహకారంతో 'ఆపరేషన్‌ డాల్ఫిన్స్‌ నోస్‌' పేరిట ఈ భారీ ఆపరేషన్‌ చేపట్టింది.
 
ఏడుగురు ఉద్యోగులు.. ఒక హవాలా ఆపరేటర్‌ 
గూఢచర్యంలో భాగస్వాములైన వారిలో ఏడుగురు నౌకాదళ ఉద్యోగులు, ఒక హవాలా ఆపరేటర్‌ను కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ అరెస్టు చేసింది. వీరిలో కర్ణాటకలోని కార్వార్‌, మహారాష్ట్రలోని ముంబై నావల్‌ బేస్‌లో పని చేస్తున్న చెరో ఇద్దరు, ఏపీలో విశాఖపట్నం నేవీ బేస్‌లో పనిచేసే ముగ్గురు ఉన్నారు. హవాలా ఆపరేటర్‌ ముంబైకి చెందిన వ్యక్తి. ఈ వ్యవహారంలో మరికొంత మంది అనుమానితులను కూడా ఏపీ నిఘా విభాగం ప్రశ్నిస్తోంది. 
 
ఏయే వివరాలు ఇచ్చారంటే..
అరెస్టు అయిన నౌకదళ ఉద్యోగులు.. భారత్‌కు చెందిన జలాంతర్గాములు, యుద్ధనౌకల కదలికల సమాచారం, క్షిపణి పరీక్షాకేంద్రాల వివరాలను ఎప్పటికప్పుడు పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు నిఘావిభాగం దర్యాప్తులో తేలింది. రక్షణ రహస్యాల చేరవేత ఎప్పటి నుంచి జరుగుతోంది? ఇంకా ఎవరెవరున్నారనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. వీరు ఏయే మార్గాల ద్వారా పాకిస్థాన్‌ హ్యాండ్లర్లకు సమాచారం చేరవేశారనే వివరాలు సేకరిస్తున్నారు.