గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2020
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 జనవరి 2020 (11:38 IST)

సీఏఏపై ప్రస్తుతించిన రాష్ట్రపతి.. బల్లలు చరస్తూ హర్షాతిరేకాలు

జాతిపిత గాంధీజీ, నెహ్రూజీ కలలను తమ ప్రభుత్వం నెరవేర్చనుందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాలు-2020 ప్రారంభం సందర్భంగా పార్లమెంటు ఉభయ సభల సమవేశాలను ఎంపీలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. నవభారత నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, దేశానికి, దేశాభివృద్ధికి ఈ దశాబ్ధం ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాల కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపు నిచ్చారు.  
 
రాజ్యాంగం ప్రకారం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్రపతి భరోసా ఇచ్చారు. 'సబ్ కా సాత్...' లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు. పార్లమెంటు సమావేశాలు గత సెషన్స్‌లో రికార్డు సృష్టించాయనీ, కీలక బిల్లులకు పార్లమెంటు ఆమోదం లభించిందని చెప్పారు. ముస్లిం మహిళలకు న్యాయం జరిగేలా ట్రిపుల్ తలాక్ చట్టాన్ని ప్రభుత్వం తెచ్చిందని అన్నారు. 370 అధికరణ రద్దు చరిత్రాత్మకమని అభివర్ణించారు. కశ్మీర్ అభివృద్ధి బాట పట్టిందని తెలిపారు. 
 
ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రాష్ట్రపతి ప్రస్తుతించారు. నిరసనలు, హింసపై రాష్ట్రపతి తన అభిప్రాయాన్నితెలియచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని హింస బలహీన పరుస్తుందని అన్నారు. రాష్ట్రపతి వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా, విపక్ష బెంచీల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి.