శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2021
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 31 జనవరి 2021 (07:55 IST)

సెంచరీ కొట్టిన పెట్రోల్ ధరలు : బడ్జెట్‌లో ఉపశమనం?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టాయి. దీంతో వాహనచోదకులు గగ్గోలు పెడుతున్నారు. అసలో కరోనా కష్టాలతో అల్లాడిపోతున్న ప్రజలకు పెట్రోల్ డీజిల్ ధరలు పెనుభారంగా మారింది. పైగా, కొవిడ్‌ సమయంలోనూ పన్నులు పెంచడంతో ప్రజల నుంచి ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. 
 
కాకపోతే.. అప్పట్లో ఆదాయవనరులు లేకపోవడంతో ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గలేదు. తాజాగా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తెరవడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. దీంతో ఇప్పటికైనా ఇంధనంపై పన్నులను తగ్గించాలనే డిమాండ్లు పెరిగాయి. తాజాగా కొన్ని నగరాల్లో పెట్రోల్‌ ధరలు రూ.90 నుంచి రూ.100కి పైగా చేరింది. ఇది ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. 
 
2020లో కరోనా లాక్‌డౌన్‌, ట్రావెల్‌ నిబంధనలు విధించడంతో చాలా చోట్ల చమురుకు డిమాండ్‌ పడిపోయింది. ఫలితంగా ముడిచమురు ధరలు 60 డాలర్ల నుంచి ఏప్రిల్‌లో 19 డాలర్లకు చేరాయి. ఆ తర్వాత మెల్లగా ధరలు పెరుగుతూ వచ్చి జనవరి 22 నాటికి బ్రెంట్‌ ముడిచమురు ధర 55 .37 డాలర్లను తాకింది.
 
లాక్డౌన్‌ సమయంలో ప్రభుత్వం పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని లీటర్‌కు రూ.32.98, డీజిల్‌పై రూ.19.98 పెంచారు. గతంలో ఇది పెట్రోల్‌పై 31.83, డీజిల్‌పై15.83గా ఉండేది. ప్రతి లీటర్‌ ఇంధనంపై విధించే ఒక రూపాయి ఎక్సైజ్‌ డ్యూటీతో ప్రభుత్వానికి అదనంగా రూ.14,500 కోట్లు ఆదాయం వస్తుంది.
 
తాజాగా పెట్రోలియం, సహజవాయువు శాఖ ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇంధనంపై విధించిన అదనపు డ్యూటీలను తొలగించాలని ఇందులో సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గిన సమయంలో భారత్‌లో అదనపు సుంకాలు విధించారు. ఇప్పుడు వాటిని తగ్గించమని ఇంధన శాఖ కోరింది. 
 
అదేసమయంలో సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో పెట్రోల్ ధరలపై వసూలు చేస్తున్న అదనపు సుంకాలను రద్దు చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అలాంటి చర్యలు తీసుకోని పక్షంలో ప్రజల ఆగ్రహం చవిచూడక తప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.