గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2021
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (15:13 IST)

కేంద్ర బడ్జెట్ 2021 : రక్షణ రంగానికి పెద్దపీట...

విత్తమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభకు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అత్యధికంగా రక్షణ రంగానికి నిధులు కేటాయించారు. ఈ ఒక్క రంగానికే గరిష్టంగా రూ.4.78 ల‌క్ష‌ల కోట్లు కేటాయించారు. ఇందులో మూల‌ధ‌న వ్య‌యం రూ.1.35 ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. గ‌తేడాదితో పోలిస్తే ర‌క్ష‌ణ రంగం మూల‌ధ‌న వ్య‌యం 19 శాతం పెరిగింది. గ‌త 15 ఏళ్ల‌లో ర‌క్ష‌ణ రంగంలో ఈ స్థాయి మూల ధ‌న వ్య‌యం లేద‌ని మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. ఇక ఈ బ‌డ్జెట్లో ఏ రంగానికి కేటాయింపులు ఎలా ఉన్నాయో ఒక‌సారి చూద్దాం. 
 
ఇకపోతే, ఈ బడ్జెట్‌లో కీలక శాఖలకు కేటాయించిన వివరాలను పరిశీలిస్తే, వినియోగదారుల వ్య‌వ‌హారాలు, ఆహారం, ప్ర‌జా పంపిణీ మంత్రిత్వ శాఖ - రూ.2,56,948 కోట్లు, హోంశాఖ రూ.1,66,547 కోట్లు, గ్రామీణాభివృద్ధి రూ.1,33,690 కోట్లు, వ్య‌వ‌సాయ‌, రైతుల సంక్షేమం రూ.1,31,531 కోట్లు,  రోడ్డు ర‌వాణా, హైవేలు రూ.1,18,101 కోట్లు, రైల్వేస్ రూ.1,10,055 కోట్లు, విద్యా శాఖకు రూ.93,224 కోట్లు, ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ రూ.73,932 కోట్లు, గృహ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ రూ.54,581 కోట్లు, కొవిడ్ వ్యాక్సినేష‌న్‌కు రూ.35 వేల కోట్లు చొప్పున కేటాయించారు. 
 
అలాగే ఇతర శాఖలకు కేటాయించిన కేటాయింపులను పరిశీలిస్తే, కనీస మద్దతు ధరకు రూ. 1.72 లక్షల కోట్ల వ్యయం, 2020-21లో రైతు సంక్షేమానికి రూ. 75 వేల కోట్లు, 1.5 కోట్ల మంది రైతులకు లబ్ధి, రైతు రుణాల లక్ష్యం రూ. 16.5 లక్షల కోట్లు, మౌలిక రంగానికి భారీగా నిధులు, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.40 వేల కోట్లు, విద్యుత్‌ రంగానికి రూ. 3.05 లక్షల కోట్ల కేటాయింపు, పీపీపీ పద్ధతి ద్వారా 7 కొత్త ప్రాజెక్టులు, వాటి అభివృద్ధి నిమిత్తం రూ. 2,200 కోట్ల కేటాయింపు, సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి రూ.1000 కోట్లు, బ్యాంక్‌ ఖాతాదారులకు ఇన్సూరెన్స్ రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంపు, బీమా రంగంలో ఎఫ్‌డీఐలు 74 శాతానికి పెంపు రూ.2 వేల కోట్లకు మించిన విలువతో 7 కొత్త నౌకాశ్రయాలు, ప్రజలకు రక్షిత మంచినీటి పథకాల కోసం రూ. 87 వేల కోట్లు చొప్పున కేటాయించారు.