వేసవి వచ్చేసింది బాబోయ్.. చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి?
రుతువులు మారేకొద్దీ, చర్మపు స్థితిగతులూ మారుతుంటాయి. శీతాకాలంలో అయితే మృతకణాలన్నీ శరీరం మీద పేరుకుపోయి ఉంటాయి. వాటిని తొలగించే ప్రయత్నం చేయకపోతే.. అవి అలానే ఉండిపోయి మరికొన్ని ఇతర సమస్యలకు కూడా దారి తీస్తాయి.
అందుకే.. బాడీ సాల్ట్ ద్వారా గానీ, షుగర్ స్క్రబ్‌ల ద్వారా గానీ, శరీరం మీద నిలిచి ఉన్న మృతకణాలను తొలగించుకోవాలి. ఇలా చేయడం వలన మృతకణాలు తొలగిపోవడమే కాకుండా.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
మృతకణాలను తొలగించేందుకు అవసరమైన మిశ్రమాన్ని స్వయంగానే తయారుచేసుకోవచ్చు. అందుకు బ్రౌన్ షుగర్, వైట్ షుగర్, ఆలివ్ నూనె, కొన్ని ల్యావెండర్ ఎస్సెన్షియల్ ఆయిల్ చుక్కలు కలిపి ఈ మిశ్రమాన్ని తయారుచేసుకోవచ్చు.
కేవలం ఆలివ్ నూనె, కొబ్బరినూనెతో మర్దన చేసినా చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది. స్నానం పూర్తి కాగానే మంచి బాడీ లోషన్ ద్వారా గానీ, క్రీమ్ ద్వారా గానీ సున్నితంగా మర్దన చేయాలి. బాగా పండిన ఒక అరటిపండు, ఒక అవకాడో, 3 స్పూన్ల కొబ్బరినూనె కలిపి, స్వయంగానే కండీషనర్‌ను తయారుచేసుకుని వాడుకోవచ్చు.
రోజుకి కనీసం 4 లీటర్ల నీరు తప్పనిసరిగా తాగాలి. పసుపు, ఆరెంజ్, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, నీలి, ఊదా రంగుల్లో ఉండే పండ్లు, కూరగాయలు తరచూ తింటూ ఉండాలి. శరీరానికి అవసరమైన కొవ్వు లభించే, అవకాడో, నెయ్యి, వెన్న, కొబ్బరినూనె, చేపలు, ముడిధాన్యాలు తరచు తినాలి. ఈ జాగ్రత్తల్లో ఏ కొన్ని పాటించినా, వేసవిలో ఏ సమస్యలకు గురికాకుండా చర్మం చక్కని నిగారింపుతో ఉంటుంది.