ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శనివారం, 6 ఫిబ్రవరి 2021 (13:23 IST)

చక్కా జామ్: దిల్లీ చుట్టూ భారీ ఎత్తున భద్రతా బలగాలు, బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు, డ్రోన్ కెమెరాలు

వ్యవసాయ సంస్కరణ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు శనివారం దేశవ్యాప్త చక్కా జామ్ (రాస్తా రోకో) చేపట్టిన నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీ నగరంతో పాటు, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో భారీ ఎత్తున పోలీసు, పారా మిలటరీ, రిజర్వు బలగాలను మోహరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రైతులు, సంఘ నాయకులు రహదారులు దిగ్బంధించారు.

 
ఏపీలో రైతుల నిరసనలు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
రైతు సంఘాల ఐక్యకార్యాచరణ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల నిరసనలు జరిగాయి. ఈ నిరసనల్లో వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు పాల్గొన్నాయి. తిరుపతి, కర్నూలు, గుంటూరు, ఒంగోలు, వైజాగ్, శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. ఈ ఆందోళన కారణంగా కొన్నిచోట్ల ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోదీ ప్రభుత్వ తీరుపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకూ ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.

 
రాజస్తాన్ - హరియాణా సరిహద్దులో
రాజస్తాన్ - హరియాణా సరిహద్దులోని షాజహాన్‌పూర్ వద్ద నిరసనకారులు జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టారు. దిల్లీలోని రోడ్ నంబర్ 56, నేషనల్ హైవే 24, వికాస్ మార్గ్, జీటీ రోడ్, జీరాబాద్ రోడ్ వంటి వ్యూహాత్మక ప్రదేశాల్లో పోలీసు సిబ్బందిని మోహరించామని దిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ అలోక్ కుమార్ చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. దిల్లీలోకి ఎవరూ చొరబడకుండా నిరోధించే విధంగా బారికేడ్లను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

 
''దిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో సుమారు 50,000 మంది పోలీసు, పారామిలటరీ, రిజర్వు ఫోర్స్ బలగాలను మోహరించాం. ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఉండటం కోసం రాజధానిలో 12 మెట్రో స్టేషన్లను అప్రమత్తం చేశాం. వాటిలో ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలను మూసివేయాలని చెప్పాం'' అని దిల్లీ పోలీసు విభాగం తెలిపింది.

 
శాంతియుతంగా చక్కా జామ్.. భద్రత బాధ్యత ప్రభుత్వానిదే: కిసాన్ ఆందోళన్ కమిటీ
చక్కా జామ్‌నుయ శాంతియుతంగా నిర్వహిస్తామని కిసాన్ ఆందోళన్ కమిటీ (కేఏసీ) నాయకుడు జగ్తార్ సింగ్ బాజ్వా చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. అయితే.. అసాంఘిక శక్తులు హింసకు పాల్పడకుండా చూడాల్సిన ప్రభుత్వానిదేనని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిపింది. ''ఇప్పటివరకూ మా నిరసన మొత్తం శాంతియుతంగానే సాగింది. రైతు సోదరులందరూ శాంతియుతంగా చక్కా జామ్ నిర్వహించాలని కోరుకుంటున్నారు.

 
హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నుతున్న రౌడీ శక్తులను ప్రభుత్వం తన సంస్థలు, భద్రతా బలగాల సాయంతో నిరోధించాల్సి ఉంటుంది'' అని ఆయన పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గత నవంబర్ 26 నుంచి దిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు నిరసన చేపట్టాయి. ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచటం కోసం ఫిబ్రవరి 6న దేశవ్యాప్తంగా చక్కా జామ్ నిర్వహిస్తామని గత సోమవారం ప్రకటించారు.

 
దిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లను మినహాయించి.. దేశమంతటా జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధిస్తామని చెప్పారు. ఈ చక్కా జామ్ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకూ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రహదారులపై భద్రత సిబ్బంది అనేక వరుసల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. దేశ రాజధాని నగరంలో పరిణామాలను పర్యవేక్షించటానికి డ్రోన్ కెమెరాలను పెద్ద ఎత్తున సిద్ధం చేశారు.

 
ఎర్ర కోట వద్ద కూడా భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించటం కనిపించింది. మింటో బ్రిడ్జి వద్ద భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి.. పోలీసు బలగాలను మోహరించారు. ముందస్తు చర్యగా ఈ ప్రాంతాన్ని మొత్తం దిగ్బంధించారు. దిల్లీలోని ఐటీఓ సమీపంలో పోలీస్ బారికేడ్ల మీద బార్బ్‌డ్ వైర్లు (ముళ్ల కంచెలు) వేశారు.