ఢిల్లీలో చక్కా జామ్ వద్ద ఆందోళన చేపట్టలేదు.. రైతు సంఘాలు
దేశ రాజధాని ఢిల్లీలో చక్కా జామ్ వద్ద ఆందోళన నిర్వహించడం లేదని రైతులు పేర్కొన్నారు. ఢిల్లీతో పాటు ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో రహదారుల దిగ్బంధం కానీ చక్కా జామ్ లాంటి నిరసనలు చేపట్టడంలేదని రైతు సంఘాలు పేర్కొన్నాయి. అయితే దేశవ్యాప్తంగా మాత్రం శాంతియుత పద్ధతిలో జాతీయ రహదారులపై నిరసనలు కొనసాగనున్నాయి.
అంబులెన్సులు, స్కూల్ బస్సులను చక్కా జామ్‌లో భాగంగా అడ్డుకోవడం లేదని సంయుక్తి కిసాన్ మోర్చా పేర్కొంది. ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ మినహా మిగితా దేశమంతా చక్కా జామ్ ఉంటుందని భారతీయ కిసాన్ యూనిన్ నేత రాకేశ్ తికయిత్ తెలిపారు.
కొందరు హింసకు పాల్పడే అవకాశం ఉన్నందున ఈ మూడు రాష్ట్రాల్లో బంద్‌ను వాయిదా వేసినట్లు చెప్పారు. ఢిల్లీలోని సింఘు, తిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల్లో గత 70 రోజుల నుంచి రైతుల ఆందోళన చేస్తున్నారు. రైతుల ఆందోళన చేస్తున్న ప్రాంతాలు మినహా ఢిల్లీలో ఎక్కడా చక్కా జామ్ ఉండదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి.
మరోవైపు 50 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఘటనలను పునరావృత్తం కాకుండా ఉండేందుకు భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీసులు, పారామిలిటరీ, రిజర్వ దళాలు.. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో పహారా కాస్తున్నాయి. 12 మెట్రో స్టేషన్ల వద్ద అప్రమత్తత ప్రకటించారు. పలు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పోలీసులు నిఘా పెట్టారు.