మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 జనవరి 2021 (22:35 IST)

రైలు కింద పడబోయిన వ్యక్తి.. క్రాసింగ్ వద్ద ముక్కలైన బైక్.. వైరల్

రైలు కింద పడబోయిన వ్యక్తిని ఇద్దరు ఆర్పీఎఫ్‌ సిబ్బంది రక్షించారు. మహారాష్ట్రలోని కళ్యాణ్‌ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పట్టుతప్పి ఫ్లాట్‌ఫాం నుంచి జారి రైలు కింద పడబోయాడు. గమనించిన ఇద్దరు ఆర్పీఎఫ్‌ సిబ్బంది వెంటనే స్పందించారు. ఆ తృటిలో ఆ వ్యక్తిని పట్టుకుని కాపాడారు. రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
 
మరోవైపు రైల్వే క్రాసింగ్‌ల చిక్కుకుపోవాల్సిన ఓ యువకుడు అదృష్టవశాత్తూ తప్పించుకున్నాడు. ముంచుకొస్తున్న ప్రమాదాన్ని సరైన సమయంలో గుర్తించడంతో తన ప్రాణాలను కాపాడుకోగలిగాడు. నాగ్‌పూర్‌లో జనవరి 24న జరిగిన ఈ ఘటన తాలూకు సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైల్వే క్రాసింగ్ వద్ద గేటు పడ్డాక కూడా ఓ యువకుడు తన బైక్‌లో పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు.
 
అయితే.. అప్పటికే రైలు వేగంగా దూసుకురావడం గుర్తించిన అతడు.. ముందుకు వెళ్లడం కుదరని పని అని భావించి అకస్మాత్తుగా వాహనానికి బ్రేకులు వేశాడు. దీంతో బైక్ అదుపుతప్పి పట్టాలకు సమీపంలో పడిపోయింది. అయితే..వాహనాన్ని పక్కకు జరిపే సమయంలో లేకపోవడంతో యువకుడు తన ప్రాణాలు రక్షించుకునేందుకు వేగంగా వెనక్కు వెళ్లిపోయాడు. ఇంతలో ఆ బైక్ వేగంగా వచ్చిన రైలు కింద పడి తునాతనకలైపోయింది. 
 
కాగా.. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డై సోషల్ మీడియా బాట పట్టాయి. దీనిపై స్పందించిన నెటిజన్లందరూ యువకుడిదే తప్పని, తొందరపాటుతో ప్రమాదంలో పడబోయాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.