కరోనావైరస్: విజయవాడలో 40 శాతం మందికి వచ్చిపోయిన కోవిడ్-19 : ప్రెస్ రివ్యూ
విజయవాడలో 40 శాతం మందికి కరోనావైరస్ వచ్చి, పోయినట్లు సిరో సర్వైలెన్స్ పరీక్షల్లో తేలిందని ఈనాడు కథనం ప్రచురించింది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో చేసిన సిరో సర్వైలెన్స్, వివిధ రకాల వైరస్ నిర్ధారణ పరీక్షల నివేదికలను గణించిన అధికారులు 43.81(40.51+3.3) శాతం మంది వైరస్ ప్రభావానికి గురైనట్లు తేల్చారు.
ఇందులో 40.51శాతం మందికి కరోనా సోకి.. పోయినట్లు సిరో సర్వైలెన్స్ లో తేలింది. వీరిలో ఎవరికీ అనుమానిత లక్షణాలు లేవు. వీరి రక్త నమూనాలు పరీక్షిస్తేనే వైరస్ వారిలోకి వచ్చి వెళ్లినట్లు తెలిసింది. మిగతా 3.3శాతం మంది అనుమానిత లక్షణాల ఉండటంతో పరీక్షలు చేయించుకున్నారని కథనంలో చెప్పారు.
కరోనా వైరస్ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్ సోకిన వారు ఎంత మంది ఉన్నారన్న విషయాన్ని గుర్తించేందుకు ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ ‘సిరో సర్వైలెన్స్’ను నిర్వహించింది. దీని ప్రకారం.. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 3,709 మందిలో 19.41% మందికి వైరస్ వచ్చి.. వెళ్లింది. విజయవాడ అర్బన్‌లో 933 మందిలో 378మందిలో కరోనా యాంటీ బాడీలు ఉన్నట్లు తేలింది.
భవంతులు, గుడిసెలు, చిన్న ఇళ్లు, అపార్టుమెంట్లు, వైరస్ ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో ఎంపిక చేసిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. మేలో వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులు పరిగణనలోనికి తీసుకొని ఈ పరీక్షలు చేశారని ఈనాడు వివరించింది.