శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 28 ఆగస్టు 2023 (18:26 IST)

విడాకులు తీసుకోవడం ఎలా? ఏయే కారణాలతో అడగొచ్చు?

Divorce
‘‘హాల్‌లో ఉండే టీవీని అత్తమామలు మాత్రమే చూస్తారు, నాకు నచ్చిన ప్రోగ్రామ్‌ను అసలు పెట్టనివ్వరు’’ .. ‘‘మా భర్త కుక్కను బయట కట్టేయరు, దాని వెంట్రుకలు ఇల్లంతా పడుతున్నాయి’’ - ఈ కారణాలతో కూడా కొందరు విడాకులను కోరుతున్నారని మీకు తెలుసా? ఫ్యామిలీ కోర్టుల్లో పనిచేస్తున్న కొందరు న్యాయవాదులు ఈ విషయాలను వెల్లడించారు. ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? అసలు పెళ్లి చేసుకోవాలా, వద్దా? అనేవి వ్యక్తిగత అంశాలు. భారత్‌లో పెళ్లికి, కలిసి జీవించేందుకు ఇప్పటికీ చాలా ప్రాధాన్యం ఉంటుంది. అయితే, నేడు వివాహాలు కాలానికి అనుగుణంగా మారుతున్నాయి. అలానే విడాకులు కూడా. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. హిందూ మ్యారేజ్ యాక్ట్-1955 ఏం చెబుతోంది? ఏ కారణాలతో విడాకులు కోరవచ్చు? ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది? లాంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
 
ఏ కారణాలతో విడాకులు ఇస్తారు?
హిందూ మ్యారేజ్ యాక్ట్-1955 ప్రకారం, భార్య లేదా భర్తకు తమ వివాహాన్ని రద్దు చేసుకునే హక్కు ఉంటుంది. ఈ చట్టంలోని సెక్షన్ 13లో ఏ కారణాలతో విడాకులు తీసుకోవచ్చో కూడా పేర్కొన్నారు. ఆ కారణాలు ఏమిటో చూద్దాం.
 
వివాహేతర సంబంధాలు: ఇతరులతో వివాహేతర సంబంధాలను కారణంగా చూపించి విడాకులను కోరవచ్చు.
 
క్రూరత్వం: దీన్ని నిర్వచించడం చాలా కష్టం. ఎందుకంటే దీనికంటూ ఒక ప్రత్యేకమైన నిర్వచనం అంటూ లేదు. మానసిక, శారీరక, లైంగిక ఇలా ఏ విధమైన క్రూరత్వాన్నైనా చూపించి విడాకులు కోరవచ్చు. దీన్ని ఏ కేసుకు ఆ కేసు విడివిడిగా చూడాల్సి ఉంటుంది.
 
భార్య, భర్తల మధ్య సంబంధం లేకపోవడం: భార్య లేదా భర్తతో ఎలాంటి సంబంధం లేకపోవడం అంటే వీరు ఒకే ఇంట్లో ఉంటూ ఒకరిని మరొకరు పట్టించుకోకపోవడం లేదా అసలు పరిచయం లేనట్లు ప్రవర్తించడమూ కారణంగా చూపిస్తూ విడాకులు కోరవచ్చు.
 
మతిస్థిమితం కోల్పోవడం: భార్య లేదా భర్త మతి స్థిమితం కోల్పోవడం లేదా పిచ్చి పట్టినట్లు ప్రవర్తించడాన్ని కూడా కారణంగా చూపించి విడాకులు పొందొచ్చు.
 
మత మార్పిడి: భార్య లేదా భర్త వేరే మతానికి మారితే, ఈ కారణాన్ని చూపించి విడాకులు పొందొచ్చు.
 
విడిచిపెట్టడం: జంటలో ఒకరు మరొకరిని విడిచిపెడితే, దీన్ని కారణంగా చూపించి విడాకులు పొందొచ్చు.
 
కనిపించకుండా పోవడం: భార్య లేదా భర్త ఏడేళ్లపాటు కనిపించకుండా పోతే అతడు లేదా ఆమెను మరణించినవారిగా పరిగణిస్తారు. అప్పుడు దీన్ని కారణంగా చూపించి కోర్టులో విడాకులకు అభ్యర్థన పెట్టుకోవచ్చు.
 
ఇద్దరూ ఒకే మాటపై ఉంటే..?
పరస్పర అంగీకారంతోనూ విడాకులు తీసుకోవచ్చు. కింది కారణాలతో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవచ్చు.
 
భార్యాభర్తలు ఏడాదికిపైగా విడివిడిగా ఉన్నప్పుడు..
భార్యాభర్తలు కలిసి జీవించడం అసాధ్యంగా మారినప్పుడు..
ఇక వివాహ బంధంలో కొనసాగలేమని ఇద్దరూ అంగీకారానికి వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి విడాకులకు అభ్యర్థన పెట్టుకోవచ్చు.
 
ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి?
సదరు వ్యక్తులు నివస్తున్న ప్రాంతంలోని కుటుంబ న్యాయస్థానంలో ఈ దరఖాస్తును పెట్టుకోవాలి. పెళ్లి జరిగిన ప్రాంతంలోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా భార్య నివసించే ప్రాంతంలోని కోర్టులోనూ ఈ దరఖాస్తు పెట్టుకోవచ్చు. విడాకులు కోరుకునే వారు దరఖాస్తు చేసుకున్నప్పుడు లేదా భార్యాభర్తలు ఒకరికొకరు నోటీసులు పంపినప్పుడు విడాకుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. హిందూ వివాహ చట్టం-1955 ప్రకారం, కలిసి జీవించడంలో ఇబ్బందులు ఎదురైతే పరస్పర అంగీకారంతో విడాకుల ప్రక్రియను ప్రారంభించవచ్చు. రెండో పక్షం విడాకులకు సిద్ధంగా లేకపోతే ఆ ప్రక్రియను ‘కంటెస్టెడ్ డివోర్స్’ అంటారు.
 
పరస్పర అంగీకారంతో ఇలా
మొదటి దశ: విడాకులు కోరుకునే దంపతులు ముందుగా సంబంధిత ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకోవాలి. ఇద్దరూ ఈ దరఖాస్తును చేసుకోవాల్సి ఉంటుంది. ఒక సంవత్సరంపాటు విడివిడిగా జీవించడం, వివాహ బంధం కొనసాగించడం అసాధ్యం అని భావించినప్పుడు విడాకులు మంజూరు చేస్తారు. అయితే, ముందుగా రెండు పార్టీలు ఈ దరఖాస్తుపై సంతకం చేయాలి.
 
రెండో దశ: విడాకుల కోసం అభ్యర్థన పెట్టుకున్న తర్వాత, ఇద్దరూ కుటుంబ న్యాయస్థానంలో హాజరు కావాలి. ఆ సమయంలో ఇద్దరూ తమ తమ న్యాయవాదులను తీసుకురావాలి. తర్వాత కోర్టు రెండు పక్షాల దరఖాస్తును పరిశీలిస్తుంది. కోర్టు కూడా ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నిస్తుంది. లేని పక్షంలో కేసు ముందుకు సాగుతుంది.
 
మూడో దశ: రెండు పార్టీల దరఖాస్తును పరిశీలించిన తర్వాత తమ తమ వాదనలను కోర్టులో నమోదు చేయాలి.
 
నాలుగో దశ: మూడో దశ తర్వాత భార్యాభర్తలకు ఆరు నెలల సమయం ఇస్తారు. ఈ కాలంలో జంట కలిసి జీవించేందుకు ఒక అవకాశం ఇస్తారు. ఆ తర్వాత రెండో దరఖాస్తు పెట్టుకోవాలి.
 
ఐదో దశ: రెండో అభ్యర్థన ఆమోదించిన తర్వాత, తుది విచారణ చేపడతారు. ఇప్పుడు కూడా మరోసారి వారి వాంగ్మూలాన్ని కోర్టు ముందు రికార్డు చేస్తారు.
 
అయితే, ప్రస్తుతం ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను కొన్ని కేసుల్లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. భరణం, పిల్లల పెంపకం లాంటి అంశాల్లో ఇద్దరి మధ్య అంగీకారం కుదిరితే, ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను రద్దు చేస్తారు.
 
పిల్లల సంరక్షణ, ఆస్తి విషయాల్లో వివాదాలు లేకపోతే..
పరస్పర అంగీకారంతో కూడిన విడాకుల్లో, పిల్లల సంరక్షణ, ఆస్తి లాంటి విషయాల్లో వివాదాలు లేకపోతే వెంటనే విడాకులు మంజూరు చేస్తారు. అందుకే విడాకులు తీసుకునే ముందు అన్ని విషయాలపై రెండు పక్షాలూ ఏకాభిప్రాయానికి రావడం అవసరం. రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత, సయోధ్యకు ఎటువంటి అవకాశం లేదని కోర్టు గుర్తిస్తే, వెంటనే విడాకులు మంజూరు చేస్తుంది.
 
మొదటి ఏడాదిలో విడాకులు ఇవ్వరు..
హిందూ వివాహ చట్టం ప్రకారం, పెళ్లి తర్వాత మొదటి సంవత్సరంలో విడాకులకు అనుమతించరు. దీని వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంది. అదేమిటంటే, పెళ్లి తర్వాత జీవించడానికి ఇద్దరికీ అవకాశం ఇస్తారు. అయితే, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నా లేదా పరిస్థితులు అసలు అనుకూలించకపోయినా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
 
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం- ప్రతి వ్యక్తికి విడాకుల నుంచి తమ వివాహాన్ని కాపాడుకోవడానికి ఒక సంవత్సర కాలం ఇవ్వాలి. పెళ్లయ్యాక మొదటి ఏడాదిలో భార్యాభర్తలు కొత్త వాతావరణానికి అలవాటు అయ్యేందుకు కొంత ఇబ్బంది పడతారు. అయితే, దీనిలో చాలా సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ఆ సమయంలో విడాకులు వెంటనే మంజూరు చేయరు. అయితే, ఇక్కడ కూడా కొన్ని మినహాయింపులు ఉన్నాయి.
 
విడాకులు ఎందుకు తీసుకుంటున్నారు?
విడాకులు ఇచ్చేందుకు చట్టాల్లో కొన్ని కారణాలు పేర్కొన్నప్పటికీ, చాలా భిన్నమైన కారణాలతోనూ చాలా మంది విడాకులు కావాలని కోర్టులను ఆశ్రయిస్తుంటారు. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని ఫ్యామిలీ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న కేతకీ జలతారే మాట్లాడుతూ, ‘‘మారుతున్న సామాజిక పరిస్థితులతో విడాకుల కారణాలు కూడా మారుతున్నాయి. అసలు నేనెందుకు రాజీ పడాలని చాలా మంది అనుకుంటున్నారు’’ అని అన్నారు.
 
‘‘ఒకప్పుడు వివాహ బంధంలో కొనసాగేందుకు చాలా ప్రయత్నించేవారు. ఇప్పుడు అలా కాదు. ఇద్దరూ ఒకే అభిప్రాయంతో ముందుకు వస్తున్నారు. కాబట్టి వారికి త్వరగా విడాకులు వస్తున్నాయి. కుటుంబం, సంబంధాల కంటే కొత్త జీవితాన్ని ప్రారంభించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని కేతకి చెప్పారు. మాళవిక రాజ్‌కోటియా కూడా ఫ్యామిలీ కోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు.
 
‘‘అమ్మాయిలు కూడా నేడు ఆర్థికంగా స్వతంత్రంగా జీవిస్తున్నారు. దీంతో వారు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కుటుంబ వ్యవస్థ పట్ల వారి దృక్పథం కూడా మారుతోంది. పురుషుల్లో చాలా మంది ఇప్పటికీ పాత సంప్రదాయాలనే అనుసరిస్తున్నారు. వారు పాత తరహా కుటుంబమే కోరుకుంటున్నారు’’ అని మాళవిక చెప్పారు. కరోనా వైరస్ వ్యాపించిన కాలంలోనూ విడాకుల కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందని కేతకి, మాళవిక వివరించారు. ‘‘ఇంటి నుంచి పని చేయడం వల్ల చాలా మంది నగరాలను విడిచిపెట్టి వారి తల్లిదండ్రులతో కలిసి ఉండేందుకు స్వగ్రామాలకు వెళ్లారు. పెద్ద నగరాల్లో స్వతంత్రంగా జీవించిన వీరు అత్తమామలతో మెలగడం చాలా కష్టమైంది. దీంతో చాలా మంది విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు’’ అని మాళవిక వివరించారు.
 
విడాకులు తీసుకోవడం తేలికేనా?
విడాకులు తీసుకోవడం అంత సులభం కాదు. దీనితో చాలా మానసిక, సామాజిక అంశాలు ముడిపడి ఉంటాయి. దంపతులకు పిల్లలుంటే పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంటుందని మాళవిక చెప్పారు. కాబట్టి విడాకులను కేవలం కాగితం ముక్కలా చూడకూడదు. భరణం, పిల్లల సంరక్షణ లాంటి అనేక అంశాలతో ఇవి ముడిపడి ఉంటాయి. పిల్లలపై విడాకుల ప్రభావం అనేది చాలా పెద్ద సామాజిక సమస్య అని మాళవిక అన్నారు.