ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 19 జూన్ 2020 (15:45 IST)

భారత్-చైనా సరిహద్దు ఘర్షణ: 'భారత సైనికులను ఎవరినీ నిర్బంధంలోకి తీసుకోలేదు' - చైనా విదేశాంగ ప్రతినిధి

భారత సైనికులను ఎవరినీ నిర్బంధంలోకి తీసుకులేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చావో లిజియన్ అన్నారు. చైనా - భారత్ సరిహద్దు పరిస్థితులపై సమచారాన్ని అందించేందుకు శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన తాము ఎవరినీ నిర్బంధంలోకి తీసుకోలేదన్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

 
చైనా సైనికులు ఇనుపరాడ్లతో భారత సైనికులపై దాడి చేశారా?
అంతకుముందు కూడా ఆయన వివిధ మీడియా సంస్థలు, ఏజెన్సీలతో మాట్లాడారు. ఇనుపరాడ్లతో భారత సైనికులపై దాడి చేశారా అన్న రాయిటర్స్‌ ప్రశ్నకు '' ఇక్కడ ఏది కరెక్టు, ఏది తప్పు అన్న విషయంలో ఎటువంటి గందరగోళం లేదు'' అన్నారు.

 
భారత చావో లిజియన్ ఎల్ఏసిని దాటినందుకే ఘర్షణ మొదలైందా అని అడగ్గా ''ఇందులో చైనా బాధ్యత ఏమీ లేదు. వివాదం ఎలా ప్రారంభమైందో మేము స్పష్టంగా వివరించాము. గతంలో కమాండర్ స్థాయిలో చర్చల తరువాత కుదిరిన ఒప్పందాన్ని సోమవారం రాత్రి సరిహద్దులో మోహరించిన భారత భద్రతా దళాలు ఉల్లంఘించాయి. భారత దళాలు వాస్తవ నియంత్రణ రేఖను దాటి, ఉద్దేశపూర్వకంగా చైనా దళాలను రెచ్చగొట్టడం ప్రారంభించాయి, దాడి చేశాయి. దీని తరువాత ముఖాముఖి ఘర్షణ, ఆపై ప్రాణనష్టం జరిగింది. మొత్తం ఘటనపై భారత్ దర్యాప్తు చేసి, బాధ్యులను శిక్షించాలి'' అని చావో అన్నారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా భారత్ జాగ్రత్తపడాలన్నారు.

 
"చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మధ్య జరిగిన సంభాషణ గురించి మేము ఇప్పటికే సమాచారాన్ని చెప్పాము" అని చావో చెప్పారు. భారతదేశం తన సరిహద్దుల్లో సైనికుల సంఖ్యను పెంచుతోంది. మీరు కూడా అలాగే సైన్యాన్ని పెంచుతారా అన్న ఎఎఫ్‌పి వార్తా సంస్థ ప్రశ్నకు "భారత్-చైనా సరిహద్దులో చైనా వైఖరి గురించి నేను ఇప్పటికే ప్రతిదీ చెప్పాను. వివాదాన్ని పరిష్కరించడానికి ఇరువర్గాలు కృషి చేస్తున్నాయి. ఇరుదేశాల మధ్య సైనిక మరియు దౌత్య స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను'' అన్నారు చావో.

 
మీ తరువాతి చర్య ఎలా ఉండబోతోందన్న పీటీఐ ప్రశ్నకు "రెండు దేశాలు అభివృద్ధి చెందుతున్న శక్తులని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో అన్నారు. రెండింటి జనాభా ఒక బిలియన్ కంటే ఎక్కువ. మేము పరస్పర గౌరవం, మద్దతుతో ముందుకు వెళితే, ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరతాయి. అపనమ్మకాన్ని, అసమానతలను పెంచుకుంటే, అది రెండు దేశాల పౌరుల ఆశయానికి అది విరుద్ధంగా ఉంటుంది. ఇరు దేశాలు కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయి, దానిని అనుసరిస్తాయి'' అని అన్నారు చావో లిజియన్‌.

 
రాహుల్ గాంధీ ప్రశ్నలకు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సమాధానం
విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విదేశాంగ మంత్రి గల్వాన్ లోయలో భారత్-చైనా సరిహద్దులో మోహరించిన భారత జవాన్ల దగ్గర ఆయుధాలు ఉన్నాయని, కానీ గత ఒప్పందం ప్రకారం వారు ఆయుధాలను ఉపయోగించలేదు” అని చెప్పారు. భారత సైన్యాన్ని ఆయుధాలు లేకుండా చైనా సైన్యం దగ్గరకు ఎవరు పంపించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

 
దీనికి సమాధానంగా విదేశాంగ మంత్రి ట్వీట్ చేస్తూ, “సరిహద్దుల్లో మోహరించిన జవాన్లు అందరూ ఆయుధాలతో నడిచేవారు. ముఖ్యంగా పోస్ట్ వదిలే సమయంలో కూడా వారి దగ్గర ఆయుధాలు ఉంటాయి. జూన్ 15న గల్వాన్‌లో మోహరించిన జవాన్ల దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. కానీ 1996, 2005 భారత్-చైనా సంధి వల్ల సుదీర్ఘ కాలంగా ఫేస్-ఆఫ్ సమయంలో జవాన్లు ఫైర్ ఆర్మ్స్(తుపాకులు) ఉపయోగించకపోవడం జరుగుతోంది” అన్నారు.

 
జూన్ 15, 16 రాత్రి గల్వాన్ లోయలో ఎల్ఏసీ దగ్గర మోహరించిన భారత్, చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. అందులో 20 మంది భారత సైనికులు చనిపోయారు. ఆ తర్వాత నుంచి రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. రాహుల్ గాంధీ గురువారం ట్వీట్ ద్వారా “మన నిరాయుధ జవాన్లను చంపడానికి చైనాకు ఎంత ధైర్యం. మన జవాన్లను ఆయుధాలు లేకుండానే అమరులయ్యేలా ఎందుకు పంపించారు” అన్నారు.

 
కానీ విదేశాంగ మంత్రి ఇచ్చిన ఈ సమాధానానికి చాలా మంది సంతృప్తి చెందినట్లు కనిపించడం లేదు. సోషల్ మీడియాలో జనం విదేశాంగ మంత్రి ప్రకటనకు స్పందనలు వస్తున్నాయి. ప్రముఖ జర్నలిస్ట్ రాహుల్ పండితా ట్వీట్‌లో మన కమాండింగ్ ఆఫీసర్ చనిపోతున్నప్పుడు, మన దగ్గర ఆయుధాలు ఉండి కూడా ఏం లాభం అని పెట్టారు.

 
“ఓకే, జవాన్ల దగ్గర ఆయుధాలు ఉన్నాయి. నాకు ఒప్పందాల గురించి కూడా తెలుసు. కానీ మన కమాండింగ్ ఆఫీసర్ శరీరాన్ని మేకులతో, ముళ్ల కంచెతో గాయపరుస్తున్నప్పుడు, ఆయుధాలు ఉపయోగించకపోతే, అవి మన దగ్గర ఉండడంలో అర్థమేముంది” అన్నారు.

 
ప్రముఖ జర్నలిస్ట్ అశుతోష్ కూడా విదేశాంగ మంత్రి సమాధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ “విదేశాంగ మంత్రి మీ ట్వీట్ ఎంత చెబుతోందో, అంత దాస్తోంది. మీరన్నట్టు భారత సైనికుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి. అయితే వారు ఆత్మరక్షణకు వాటిని ఎందుకు ఉపయోగించలేదు దయచేసి దీనికి సమాధానం ఇవ్వండి. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. ఏదీ దాచద్దు, నిజమేంటో అది చెప్పండి” అన్నారు.

 
భారత-చైనా మధ్య ఆరు గంటలపాటు జరిగిన మేజర్ జనరల్ స్థాయి చర్చలు ముగిసినట్లు ఏఎన్ఐ తెలిపింది. జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయ దగ్గర ఆపరేషన్లలో పాల్గొన్న సైనికులందరూ దీనికి కారణమని, ఆ చర్యల్లో ఎవరూ గల్లంతు కాలేదని ఏఎన్ఐ చెప్పింది. మరోవైపు జూన్ 23న ఆర్ఐసీ( రష్యా-భారత్-చైనా) విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ పాల్గొంటుందని భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది.

 
సరిహద్దుల్లో శాంతిని కాపాడాలని, చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని మేం నిశ్చయించుకున్నాం. అదే సమయంలో ప్రధాని నిన్న చెప్పినట్లు భారత సౌర్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత విషయంలో మేం బలంగా కట్టుబడి ఉన్నాం అని విదేశాంగ శాఖ కార్యదర్శి వికాస్ స్వరూప్ చెప్పారని ఏఎన్ఐ తెలిపింది.