1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 10 జులై 2023 (16:57 IST)

విడాకులు తీసుకుని పెళ్లిళ్లు చేసుకోవడం నేరమా? పవన్ కళ్యాణ్‌ను జగన్ పదే పదే ఎందుకు విమర్శిస్తున్నారు?

pawan kalyan
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల చుట్టూ పదే పదే చర్చ సాగుతోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా కాలంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో బహిరంగ సభల సాక్షిగా పవన్ కళ్యాణ్‌‌ను పెళ్లిళ్ల విషయమై విమర్శిస్తున్నారు. అమ్మ ఒడి పథకం నిధుల విడుదల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో నిర్వహించిన సభలో కూడా సీఎం ఈ అంశాన్ని ప్రస్తావించారు.
 
తన పెళ్లిళ్లపై వస్తున్న విమర్శలకు పవన్ కళ్యాణ్‌ పలుమార్లు సమాధానమిచ్చారు. కొన్నిసార్లు ఎదురుదాడికి కూడా ఆయన ప్రయత్నించారు. అయినప్పటికీ విమర్శలు మాత్రం ఆగడం లేదు. పవన్ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితం మీద గురిపెట్టి ప్రత్యర్థుల నుంచి, ముఖ్యంగా వైసీపీ నుంచి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. విడాకులు ఇచ్చి, మరో పెళ్లి చేసుకోవడం నేరమా అనే రీతిలో ఈ విమర్శలు ఉంటున్నాయి. పెళ్లిళ్ల విషయంలో పవన్ కళ్యాణ్‌‌పై ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా, ప్రత్యర్థులు ఎందుకు విమర్శలు చేస్తూనే ఉంటారనేది చర్చనీయాంశం అవుతోంది. రాజకీయ లక్ష్యాలతోనే ఈ విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది. ఈ వివాదం నేపథ్యంలో విడాకులు-పెళ్లిపై చట్టం ఏం చెబుతోందో చూద్దాం.
 
చట్టం ఏం చెబుతోంది?
భారతీయ విడాకుల చట్టం-1869 ప్రకారం వివిధ కారణాలతో విడాకులు తీసుకునే అవకాశం ఉంది. పెళ్లి చేసుకున్న జంట అంగీకారంతో వాటిని మంజూరు చేస్తారు. ఇద్దరిలో ఎవరైనా విడాకులు కోరే అవకాశం ఉంటుంది. వివాహం మాదిరిగానే విడాకులకు హిందూ, ముస్లిం, క్రైస్తవ జంటలకు కూడా విడివిడి చట్టాలున్నాయి. విడాకులు మంజూరు చేసే సమయంలో పిల్లలుంటే వారి పోషణ సహా పలు అంశాలు పరిగణనలోకి తీసుకుని భరణం కూడా నిర్ణయిస్తారు. వాటి మీద అంగీకారం కుదిరిన తర్వాత విడాకులు తీసుకుని విడిపోవడం సాధారణ అంశమే. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఇలా విడాకులు తీసుకున్న వారిలో ఉంటారు. రాజకీయ నేతలు కూడా విడాకులు తీసుకుని కొత్త జీవితాలు ప్రారంభించిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి.
 
చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న జనసేన
పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన ఆయన, ప్రస్తుతం మూడో భార్యతో జీవనం సాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ రాజకీయంగా ప్రత్యర్థుల మీద ఘాటైన విమర్శలు చేస్తుంటారు. సినీ ఫక్కీలో ఆయన పర్యటనలు, ప్రసంగాలు సాగుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్‌‌ను విమర్శించడానికి అనేక సందర్భాల్లో ప్రత్యర్థులు ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో అయితే ఇది హద్దు మీరుతూ ఉంటుంది. ఇటీవల జనసేన అధికారికంగా పోస్ట్ చేసిన ఓ ఫోటో చుట్టూ దుమారం రేగింది.
 
పవన్ కళ్యాణ్‌ మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారంటూ ఒక వర్గం మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ నేపథ్యంలో భార్యతో కలిసి పవన్ కళ్యాణ్ ఓ యాగం నిర్వహించారంటూ ఫోటో ఒకటి విడుదలయ్యింది. అయితే అది మార్ఫింగ్, ఎడిటింగ్ చేసిన ఫోటో అంటూ వైసీపీ సోషల్ మీడియా విభాగం విమర్శలు గుప్పించింది. తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేస్తున్న విమర్శలు ఎక్కువవడంతో చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు జనసేన తెలిపింది. ఇటీవల కురుపాం సభలో సీఎం మాట్లాడుతూ- ‘‘వారిలా మనం మీసాలు తిప్పలేం, వారిలా మనం తొడలు కొట్టలేం, వారిలా మనం బూతులు తిట్టలేం, నలుగురు, నలుగురిని పెళ్లి చేసుకోలేం, నాలుగేళ్లకోసారి భార్యను మార్చలేం’’ అన్నారు. జగన్ వ్యాఖ్యల తర్వాత ఆయన అనుచరులు, వైసీపీ సోషల్ మీడియా విభాగంవారు మరింత తీవ్రంగా పవన్ కళ్యాణ్‌ పెళ్లిళ్ల చుట్టూ విమర్శలు గుప్పిస్తున్నారు.
 
వ్యూహాత్మకమేనా?
గతంలో కూడా పెళ్లిళ్ల మీద విమర్శలు వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్‌ స్పందించారు. తాను ప్రత్యేక పరిస్థితుల్లో చట్ట ప్రకారం నడుచుకున్నానే తప్ప, ఎవరినీ మోసం చేయలేదని వివరణ కూడా ఇచ్చారు. ‘‘కావాలంటే మీరు కూడా చేసుకోండి’’ అని కూడా వ్యాఖ్యానించారు. అయినప్పటికీ పవన్ పెళ్లిళ్ల చుట్టూ రాజకీయ దుమారం మాత్రం ఆగడం లేదు. "ఇదంతా వ్యూహాత్మకంగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. వ్యక్తిగత అంశాల మీద చర్చ ద్వారా అసలు సమస్యలను మరుగునపరిచే ప్రయత్నంగా చూడాలి. ప్రభుత్వ వైఫల్యాలను పవన్ విమర్శిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆయన పెళ్లిళ్ల మీద దాడి జరుగుతోంది. దాంతో అసలు విషయం పక్కదారి పడుతోంది.
 
వైఎస్సార్సీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా సోషల్ మీడియా అంతా పెళ్లిళ్ల చుట్టూ రచ్చ సాగుతోంది. ఇది ప్రభుత్వ వ్యూహంలో భాగమే. దీనిని పవన్ కళ్యాణ్ గ్రహించినట్టుగానే ఉంది. అయినప్పటికీ మూకుమ్మడి దాడిని సహించలేక సమాధానం చెప్పుకోవాల్సిన స్థితికి జనసేన వెళుతోంది" అంటూ రాజకీయ పరిశీలకుడు చెవుల రామాంజనేయులు అభిప్రాయపడ్డారు. నైతికంగా పవన్ కళ్యాణ్‌‌ను కట్టడి చేయడానికి సీఎం ఇలాంటి ప్రయత్నానికి దిగుతున్నట్టుగా భావించాల్సి ఉంటుందని ఆయన బీబీసీతో అన్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న నాయకుడి గురించి నాలుగు పెళ్లిళ్లు అంటూ ముఖ్యమంత్రి పదేపదే విమర్శలు చేయడం వ్యూహాత్మక దాడిగా భావించాల్సి ఉంటుందని సీనియర్ జర్నలిస్ట్ ఎం. విజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు.
 
"భారతీయ సమాజంలో నేటికీ పెళ్లిళ్ల విషయంలో కొంత కట్టుబాటు ఉంది. చాలామంది సమాజంలో ఏమనుకుంటారోననే భయంతోనే కలిసి సాగడానికి సర్దుబాటు చేసుకుంటారు. అలాంటిది ఒక నాయకుడు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సంప్రదాయవాదులకు రుచించదు. కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన తెస్తున్నట్టుగా భావించాలి. నిలకడ లేని మనిషి అంటూ విమర్శించడం ద్వారా రాజకీయంగానూ, నైతికంగానూ తన ప్రత్యర్థిని ఇరకాటంలోకి నెట్టేందుకు జగన్ ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది" అని విజయ్ కుమార్ చెప్పారు. రాజకీయాల్లో వ్యక్తిగత జీవితం మీద విమర్శలు గతం నుంచీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా తన హోదాను మరచిపోయి వ్యవహరిస్తున్నట్టుగా భావించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
 
ఇది మహిళల వ్యక్తిత్వ హననమే: రచయిత్రి శమంతకమణి
పవన్ కళ్యాణ్ పెళ్లి చుట్టూ సాగుతున్న చర్చ పేరుతో మహిళల వ్యక్తిత్వ హననం చేస్తున్నారంటూ సమన్విత సంస్థ ప్రతినిధి, రచయిత్రి దుట్టా శమంతక మణి అభిప్రాయపడ్డారు. "సోషల్ మీడియాలో మహిళల మీద దాడి నీచ స్థాయిలో ఉంటుంది. విడివిడిగా జీవిస్తున్న వారిని కూడా పవన్ కళ్యాణ్ పేరుతో వివాదంలోకి లాగుతున్నారు. రాజకీయ లక్ష్యాల కోసం మహిళలను వేధించడం ఏం నీతి? దీనికి అడ్డుకట్ట వేయాలి. ఎవరి జీవితం వాళ్ళది. అయినా భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించి, ఎదుటి వారి ప్రైవసీకి భంగం కలిగించడం తగదు" అని ఆమె బీబీసీతో చెప్పారు. ఇలాంటి వ్యవహారాలపై చట్టపరమైన చర్యలు అవసరమన్నారు.
 
‘ఏపీలో నాయకులు హుందాతనం వదిలేశారు’
చట్టపరంగా వ్యవహరించిప్పటికీ పవన్ కళ్యాణ్‌ పెళ్లిళ్లను అదే పనిగా తెరమీదకు తీసుకురావడం అధికార పార్టీ తీరుకు అద్దంపడుతోందని బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. "పవన్ కళ్యాణ్ రాజకీయ విమర్శలు చేస్తే దానికి ఆయన వ్యక్తిగత వ్యవహారాలు ప్రస్తావించడం సమంజసంగా లేదు. ఏపీలో రాజకీయ నేతలు హుందాతనం వదిలేశారు. కొంతకాలంగా పబ్లిక్ మీటింగ్‌లలో వాడుతున్న భాష, మీడియా ముందు వల్లిస్తున్న బూతులు చూస్తుంటే ఆందోళనకరంగా ఉంది. తాను నోరు తెరిస్తే అంటూ పవన్ అనడం, దానికి ముందు సీఎం తన స్థాయి మరచి మాట్లాడడం చూస్తుంటే యువతకు వాళ్లు ఏం నేర్పుతున్నారన్నది అంతుబట్టడం లేదు. వీళ్లను చూసి ట్రోలింగ్ ముఠాలు మరింత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయి" అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
 
అన్ని పార్టీల నాయకులు ఇలాంటి ధోరణి మానుకోవాలని, ముఖ్యమంత్రి నుంచే ఇలాంటి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మొదలుకావాలని ఆయన సూచించారు. విపక్షాలు హద్దు మీరితే అర్థం ఉంటుందిగానీ అధికారపక్షం, అందులోనూ సీఎం స్థాయి వ్యక్తులు అలాంటి సంకుచిత వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని సుబ్బారావు అభిప్రాయపడ్డారు.
 
మా పార్టీ అలా వ్యవహరించదు: సజ్జల రామకృష్ణారెడ్డి
ఈ అంశంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ- వైసీపీ ఎవరిపైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడదన్నారు. ‘‘పార్టీ సోషల్‌ మీడియాలో వ్యక్తిత్వ హననం మా పార్టీ సిద్ధాంతం కాదు. మేము ఏనాడూ అలా వ్యక్తిగత విమర్శలకు దిగం. నిజానికి ఆ అలవాటు తెలుగుదేశం, జనసేన పార్టీలకే ఉంది. వైఎస్‌ కుటుంబం విలువలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే మా పార్టీ కార్యకర్తలు కూడా ఏనాడూ ఆ విధంగా వ్యవహరించరు. రాజకీయాలు ప్రజల్లో తేల్చుకోవాలనేది మా పార్టీ సిద్ధాంతం’’ అని ఆయన శనివారం మీడియా సమావేశంలో చెప్పారు.