శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: మంగళవారం, 6 ఆగస్టు 2019 (20:07 IST)

ఆ విధంగా ముందుకు పోయారు... జమ్ము కశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం

జమ్ము కశ్మీర్ పునర్విభజన బిల్లు పార్లమెంటు ఉభయసభల్లో ఆమోదం పొందింది. సోమవారం రాజ్యసభ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇవాళ లోక్‌సభలో కూడా ఆమోదం పొందింది. దీంతో జమ్ము-కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటాయి. మొత్తం 433 మంది సభ్యుల్లో బిల్లుకు అనుకూలంగా 366, వ్యతిరేకంగా 66 ఓట్లు వేశారు. ఒకరు గైర్హాజరు అయ్యారు.

 
జ్యోతిరాదిత్య ధిక్కార స్వరం
కాంగ్రెస్ బిల్లును వ్యతిరేకించగా, ఆ పార్టీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్‌లో "జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లను భారతదేశంలో అంతర్భాగంగా మార్చే ఈ నిర్ణయాన్ని నేను సమర్థిస్తున్నా. అయితే రాజ్యాంగ ప్రక్రియను పూర్తిగా అనుసరించి ఉంటే బాగుండేది. అప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎదురయ్యేవి కావు. ఏదేమైనా, దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయం కాబట్టి నేను దీనికి మద్దతిస్తున్నా" అని తెలిపారు.

 
ప్రధాని సంకల్పంతోనే 370 కళంకం తొలగింది-అమిత్ షా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృఢ సంకల్పాన్ని ప్రశంసిస్తున్నట్లు హోంమంత్రి అమిత్ షా చెప్పారు. "ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఇప్పటివరకూ తొలగించలేకపోయిన 370 కళంకం ఆయన వల్లే తొలగింది" అన్నారు. 

 
లోక్‌సభకు ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీల నినాదాలు
ప్రధాన మంత్ర నరేంద్ర మోదీ లోక్‌సభకు హాజరయ్యారు. ఆయన సభలోకి రాగానే బీజేపీ, మిత్ర దళాల ఎంపీలు నిలబడి 'వందేమాతరం' నినాదాలు చేశారు. అలా నినాదాలు చేయడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దాంతో హోమంత్రి అమిత్ షా "విపక్షాలకు ఇక్కడ నినాదాలు చేయడం అభ్యంతరకరంగా ఉంది, ఇలాంటి నినాదాలు దేశమంతా చేస్తున్నారు" అన్నారు.

 
మన దగ్గర కూడా వెస్ట్ బ్యాంక్‌లా చేశారు - ఒవైసీ
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ "నేను ఎప్పుడు హిమాచల్ వెళ్లి వ్యవసాయం కోసం భూమి కొనచ్చో ప్రభుత్వం చెప్పాలన్నారు. ఇది అంత మంచి నిర్ణయమే అయితే కశ్మీర్లో అందరినీ బయటకు రానివ్వండి. వారిని కూడా సంబరాలు చేసుకోనివ్వండి" అన్నారు.

 
పాకిస్తాన్ పార్లమెంటులో భారత్‌పై మాట్లాడిన ఇమ్రాన్
పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తమ దేశ పార్లమెంటులో మాట్లాడారు. "మొదట నరేంద్ర మోదీ శాంతికాముకులని నాకు అనిపించింది. భారత్‌లో ఎన్నికల సమయంలో ఆయన ప్రతి అడుగు వార్ హిస్టీరియాను కలిగించి, ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడానికి ప్రయత్నించినట్టు ఉంది" అన్నారు.

 
ఫారూక్ అబ్దుల్లా గురించి సభకు ఆందోళన అక్కర్లేదు-అమిత్ షా
హోంమంత్రి అమిత్ షా "నేను నాలుగోసారి చెబుతున్నా, నాకు మరో పది సార్లు చెప్పే ధైర్యం కూడా ఉంది. ఫారూక్ అబ్దుల్లా అదుపులో లేడు, అరెస్టు కూడా చేయలేదు. ఆయన ఆరోగ్యం సరిగా లేకుంటే డాక్టర్ ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్తారు. సభకు ఆయన గురించి ఆందోళన అక్కర్లేదు. ఆయనకు సరిగా లేకుంటే ఇంటి నుంచి బయటకొచ్చేవారు కాదు" అన్నారు.

 
నా గురించి హోమంత్రి అబద్ధాలు చెబుతున్నారు- ఫరూక్ అబ్దుల్లా
ఇటు శ్రీనగర్‌లో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ్దుల్లా హోంమంత్రి పార్లమెంటులో నేను గృహనిర్బంధంలో లేనని, నేనే ఇంట్లోనే ఉంటున్నానని తప్పుడు సమాచారం ఇచ్చారు. నేను అలా ఎందుకు చేస్తాను అన్నటారు.

 
'లద్దాఖ్, కార్గిల్‌లో ప్రజలు సంతోషంగా ఉన్నారు'
లద్దాఖ్ బీజేపీ ఎంపీ జామ్యాంగ్ సెరింగ్ ఈరోజు "ఇక్కడ లద్దాఖ్ గురించి మాట్లాడే వాళ్లందరూ ఎప్పుడూ లద్దాఖ్‌ మనది అనుకోలేదు. యూటీ చేయాలని మేం ఎప్పట్నుంచో కోరుతున్నాం, కానీ ఎవరూ అది పట్టించుకోలేదు. నేను కార్గిల్ నుంచి ఎన్నికై వచ్చాను. అక్కడి ఓటర్లు కేంద్ర పాలిత ప్రాంతం కోసం ఓటు వేశారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ నిర్ణయంతో రెండు కుటుంబాలు మినహా, ఎవరి జీవనోపాధికీ నష్టం జరగ లేదు" అన్నారు.

 
కశ్మీరీ నేతలను విడుదల చేయాలి-రాహుల్
ఆయన తన ట్వీట్‌లో "కశ్మీర్‌ ప్రధాన రాజకీయ నేతలను రహస్య ప్రాంతాల్లో బంధించారు. ఇది రాజ్యాంగవిరుద్ధం, అప్రజాస్వామికం. ఇది చాలా తెలివితక్కువ చర్య. ఎందుకంటే, దీనివల్ల తీవ్రవాదులకు భారత ప్రభుత్వం ఖాళీ చేయించిన నాయకత్వాన్ని భర్తీ చేసే అవకాశం లభిస్తుంది. జైల్లో పెట్టిన నేతలను వెంటనే విడుదల చేయాలి" అన్నారు.

 
తీర్మానం లేకుండా విభజన ఎలా?
రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించారని, సెక్షన్ 3 ప్రకారం రాష్ట్ర సరిహద్దులను మార్చాలంటే ఆ రాష్ట్ర శాసన సభ నుంచి అనుమతి ఉన్నట్లుగా తీర్మానం కావాలని, అలాంటి తీర్మానం ఏమీ లేకుండానే రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ప్రశ్నించారు. జమ్మూ కశ్మీర్‌లో ప్రస్తుతం అసెంబ్లీ లేదని, దాన్ని రద్దు చేశారని తెలిపారు.
 
మరి మీరు ఆంధ్రప్రదేశ్‌ను ఎలా విభజించారు? అని వైసీపీ సభ్యురాలు వంగా గీత ప్రశ్నించారు. దీనికి తివారీ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ను విభజించినప్పుడు ఆ రాష్ట్ర అసెంబ్లీ పనిచేస్తోందని, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కూడా చేసిందని, ఆ విషయాన్ని సభలో కూడా ప్రస్తావించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా యూపీఏ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలనూ అతిక్రమించలేదని అన్నారు. అయితే, వైసీపీ సహా పలు పార్టీల సభ్యులు ఆయన సమాధానాన్ని తిరస్కరిస్తూ నినాదాలు చేశారు.
 
ఆర్టికల్ 370లో జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు ఉన్నట్లే, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలను కల్పించారని, ఇప్పుడు కశ్మీర్‌కు ఆ అధికారాలు తొలగించారని, మరి మిగతా రాష్ట్రాల సంగతేంటి? అని ప్రశ్నించారు. హైదరాబాద్, జునాగఢ్‌లు ఇప్పుడు భారతదేశంలో అంతర్భాగం అయ్యాయంటే దానికి కారణం పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అని మనీష్ తివారీ అన్నారు.

 
‘రాష్ట్ర విభజనపై కేసు సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉంది’ - వైసీపీ
రాష్ట్ర విభజనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపిందని కాంగ్రెస్ సభ్యులు చెప్పడం సరికాదని, రాష్ట్ర విభజనను అసెంబ్లీ మూడింట రెండొంతుల మెజార్టీతో తిరస్కరించిందని, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా కూడా చేశారని వైసీపీ సభ్యుడు రఘురామకృష్ణం రాజు చెప్పారు. రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టులో తాను కేసు వేశానని, అప్పుడు .. రాష్ట్ర విభజన జరిగిపోయింది కదా ఏం చేస్తాం అన్నారని, ఆ కేసు ఇప్పటికీ పెండింగ్‌లో ఉందని చెప్పారు.

 
కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయంతో దేశంలో ఒకే రాజ్యాంగం, ఒకే జాతీయ పతాకం ఉంటాయని అన్నారు. కశ్మీరీ పండిట్లు తిరిగి వెనక్కు వెళ్లేందుకు కేంద్రం సహకరించాలని అన్నారు. ఈ బిల్లుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

 
‘శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అరెస్టైతే పట్టించుకోలేదే?’ - బీజేపీ
జమ్మూ, కశ్మీర్‌లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల గృహ నిర్బంధం గురించి పలువురు సభ్యులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఒకప్పుడు అదే జమ్మూ కశ్మీర్‌లో అనుమతి లేకుండా అడుగుపెట్టిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ అరెస్టైతే, 40 రోజులకు పైగా ఆచూకీ లభించకపోతే ఎవ్వరూ పట్టించుకోలేదని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. కస్టడీలోనే అనుమానాస్పద రీతిలో చనిపోతే, ఆయన మృతదేహాన్ని శ్రీనగర్ నుంచి కోల్‌కతా తీసుకువచ్చేందుకు కొన్ని వేల రూపాయలు కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదని తెలిపారు. ఇప్పుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీకి నివాళులు అర్పించే సమయం వచ్చిందని అన్నారు.

 
టీఎంసీ వాకౌట్
జమ్మూ కశ్మీర్ శాంతియుతంగా ఉండాలని, అక్కడ ఎలాంటి సమస్యలూ తలెత్తకూడదని టీఎంసీ లోక్‌సభా పక్ష నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ అన్నారు. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేసినా, వ్యతిరేకంగా ఓటేసినా.. ఈ బిల్లులో భాగం అయినట్లేనని, ఆ పని చేయడం తమకు ఇష్టం లేదని, కాబట్టి తాము వాకౌట్ చేస్తున్నామంటూ ఆయన, టీఎంపీ ఎంపీలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

 
‘మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారనే సవరించారు.. ప్రజల కోసం కాదు’ - డీఎంకే
‘‘ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు దాన్ని రద్దు చేశారు. అంతే తప్ప ఇది ప్రజల కోసం చేసింది కాదు. ప్రజలు అడిగారని చేసింది కాదు. అసెంబ్లీ తీర్మానం ద్వారా చేయాల్సింది. అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత ఇవన్నీ చేయాల్సింది’’ అని డీఎంకే లోక్‌సభా పక్ష నాయకుడు టీఆర్ బాలు అన్నారు.

 
‘కశ్మీర్ కోసం ప్రాణాలు ఇస్తాం’ - హోం శాఖ మంత్రి అమిత్ షా
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష నాయకుడు ఆధిర్ రంజన్ చౌధరి మాట్లాడుతూ.. ‘‘నిబంధనల్ని అతిక్రమించి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. కశ్మీర్ భారత అంతర్గత వ్యవహారమా? కాదా? మరి ఐక్యరాజ్యసమితి తీర్మానం, సిమ్లా ఒప్పందం, వాజ్‌పేయీ లాహోర్ యాత్రల సంగతి ఏంటి? తాజాగా ట్రంప్ మధ్యవర్తిత్వంపై ప్రభుత్వం స్పందిస్తూ.. ఇది అంతర్గత వ్యవహారం అని అన్నదని, ఏ వివాదమూ లేకపోతే అంతర్గత వ్యవహారం అని ఎందుకు అన్నది? దీనిపై వివరణ ఇవ్వండి’’ అని అడిగారు.

 
కశ్మీర్ భారత అంతర్గత భాగమని, ఇది భారత అంతర్గత వ్యవహారమని.. కశ్మీర్ రాజ్యాంగంలో కూడా ఇలాగే పేర్కొన్నారని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. కాగా, నిబంధనలు అతిక్రమించారని ప్రశ్నిస్తున్నారని, ఇంతకీ ఏఏ నిబంధనలు అతిక్రమించామో చెప్పాలని ప్రశ్నించారు. ఎందుకు ఆగ్రహిస్తున్నారని ప్రతిపక్ష ఎంపీలు ప్రశ్నించగా.. ‘‘కశ్మీర్ కోసం ప్రాణాలు ఇస్తాం’’ అని అమిత్ షా ఆవేశంగా అన్నారు.


సభలో తాను జమ్మూ, కశ్మీర్ అన్నప్పుడల్లా.. పాక్ ఆక్రమిత కశ్మీర్, అక్సాయ్‌చిన్ రెండూ కూడా అందులో భాగమని ఆయన వివరించారు. ఇది చారిత్రాత్మక బిల్లు ఇదని చెప్పారు. డీఎంకే లోక్‌సభాపక్ష నాయకుడు టీఆర్ బాలు మాట్లాడుతూ.. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ అని, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులను గృహ నిర్బంధానికి గురి చేశారని, వారు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.