శనివారం, 14 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 15 అక్టోబరు 2024 (13:17 IST)

కొల్లేరు: వరదనీటిని, ఉప్పునీటిని నియంత్రించే రెగ్యులేటర్ల నిర్మాణం ఎప్పుడు?

Kolleru
ఈ ఏడాది సెప్టెంబర్‌ తొలివారంలో సగం బెజవాడను ముంచెత్తిన బుడమేరు.. అటు కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో ఉన్న కొల్లేరునూ కకావికలం చేసింది. దీంతో కొల్లేరు రెగ్యులేటర్ల నిర్మాణం మళ్లీ తెరపైకి వచ్చింది. భారీ వర్షాలు, వరదలు వచ్చినపుడు ఎగువ ప్రాంతాల నుంచి కొల్లేరుకు భారీగా నీరు చేరుతుంది. అయితే ఎక్కడా నీటిని నియంత్రించే లేకపోవడంతో ఈ నీరంతా సముద్రంలోకి వృథాగా పోతోంది.
 
నవంబర్‌ నుంచి జూలై మధ్య కొల్లేరులో నీటి ప్రవాహం తగ్గుతుంది, అదే సమయంలో సముద్రపు నీరు ఎగదన్ని కొల్లేరులో కలవడంతో నీళ్లు ఉప్పుమయమై పొలాలు చౌడుబారుతున్నాయి. రెగ్యులేటర్ల నిర్మాణంతో ఈ రెండు సమస్యలకు పరిష్కారం చూపొచ్చని 1985లో గుర్తించారు. ''కొల్లేరు సరస్సు నిత్యం నీటితో కళకళలాడాలంటే రెగ్యులేటర్ల నిర్మాణమే మార్గమని నాటి ప్రభుత్వం కొల్లేటి సమస్య పరిష్కారం కోసం నియమించిన మిత్ర, శ్రీ రామకృష్ణయ్య కమిటీలు చెప్పాయి. అప్పటి నుంచి అదిగో ఇదిగో అంటూ చెబుతున్న పాలకులు రెగ్యులేటర్ల నిర్మాణాన్ని నేటికీ మొదలుపెట్టలేదు’’అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
 
‘గతంలో కడతామన్నారు’
కొల్లేరు అభయారణ్యం పరిరక్షణకు ఏలూరు జిల్లా కైకలూరు మండలం ఉప్పుటూరు ముఖద్వారం దుంపగడప వద్ద, ఉప్పుటేరు సముద్రంలో కలిసే కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం పడతడిక వద్ద, కలిదిండి మండలం పెదలంక డ్రెయిన్‌పై మూడు రెగ్యులేటర్లు నిర్మిస్తామని గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే ప్రకటించిందని, ఇందుకు 470 కోట్ల రూపాయలు నిధులు కూడా కేటాయిస్తున్నట్లు తెలిపిందని శ్రీనివాసరావు గుర్తుచేశారు. 2022 మే 16న గణపవరం మండలంలో జరిగిన బహిరంగ సభలో అప్పటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడుతూ రెగ్యులేటర్ల నిర్మాణానికి వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 2023 జూన్‌‌లో శంకుస్థాపన చేస్తామని ప్రకటించారని, కానీ ఆ తర్వాత వాటి నిర్మాణం గురించి పట్టించుకోలేదని శ్రీనివాసరావు చెప్పారు.
 
రెగ్యులేటర్లు నిర్మిస్తే..
బుడమేరు, రామిలేరు, తమ్మిలేరుతో పాటు కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 67 మేజర్‌, మీడియం డ్రెయిన్ల ద్వారా కొల్లేరు సరస్సులోకి లక్షా 11 వేల క్యూసెక్కుల మురుగునీరు చేరుతోంది. నవంబర్‌ మొదటివారం నుంచి జూలై ఆఖరి వరకు కొల్లేరులో నీటి ప్రవాహం ఉండదు. ఆ సమయంలో కొల్లేరు చెరువుల్లో నీరు లేక మత్స్యకారుల జీవనాధారమైన చేపల వేటకు విఘాతం కలుగుతోంది. లక్ష ఎకరాల్లోని చేపల చెరువుల్లో ఐదు అడుగుల నీరు ఉండాలంటే సుమారు 32 టీఎంసీలు నీరు అవసరం.
 
''రెగ్యులేటర్లు నిర్మించి నవంబర్‌ నుంచి జూలై వరకు నీళ్లు మళ్లిస్తే.. కొల్లేరు నీటితో కళకళలాడుతుంది. ఆ సమయంలో చేప, రొయ్య పిల్లలను వదిలితే అవి పెద్దదవుతాయి. దీంతో కొల్లేరు పరీవాహక ప్రజలు నిరంతరం చేపల ద్వారా ఉపాధి పొందుతారు. సముద్రపు నీటి నుంచి పొలాలకు రక్షణ లభించి రైతులకు మేలు జరుగుతుంది' అని కొల్లేటి గ్రామం కలకుర్రు మాజీ సర్పంచ్‌ ఘంటశాల పెద్దిరాజు బీబీసీతో అన్నారు.
 
’’ఏటా వందల రకాల పక్షులు వివిధ దేశాల నుంచి ఇక్కడికి వలస వస్తుంటాయి. కొల్లేరులో అరుదైన మత్స్య సంపద ఉంది. చేపల వేటతోనే ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తుంటారు. 120 గ్రామాలు కొల్లేరును ఆనుకొని ఉన్నాయి. కానీ కొల్లేరు ఆక్రమణలకు గురి కావడంతోపాటు చుట్టుపక్కల పరిశ్రమల వ్యర్ధాలన్నీ దానిలో కలుస్తున్నాయి. దీంతో అభయారణ్యంలో మత్స్య సంపద హరించుకుపోతోంది. గతంలో కొల్లేరులో ఏడాదికి పది నెలలుపాటు నీరు ఉండేదని, ఇప్పుడు ఆక్రమణల వల్ల రెండు నెలలకు సరిపడా నీరు కూడా ఉండటం లేదు'' అని కొల్లేటి మత్స్యకార సంఘం నేత మండల రాజేంద్రప్రసాద్‌ చెప్పారు.
 
ఆకివీడు సమీపంలోని ఉప్పుటేరు పూడుకుపోవడంతో వరద నీరు వేగంగా సముద్రంలోకి వెళ్లడం లేదన్నారు. ఉప్పుటేరులో 12,000 క్యూసెక్కుల నీరు వెళ్లాల్సి ఉండగా 6,000 క్యూసెక్కులు కూడా వెళ్లడం లేదనే సంగతి ఇటీవల వరదలతో స్పష్టమైందని ఆయన తెలిపారు. ఈ సమస్యలన్నింటికీ రెగ్యులేటర్ల నిర్మాణమే పరిష్కారమని రాజేంద్రప్రసాద్‌ అభిప్రాయపడ్డారు.
 
చౌడుబారుతున్న భూములు
’’కొల్లేరు భూములు సముద్రమట్టం నుంచి తొమ్మిది అడుగుల ఎత్తులో ఉంటాయి. ఏడాదిలో పది నెలలు నీరు పారుతూ ఉంటే సముద్రం నుంచి పైకి వచ్చే ఉప్పు కొట్టుకుపోతుంది.'' అని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు. ''రెగ్యులేటర్లు లేకపోవడంతో ఏటా వేసవి కాలంలో సముద్రపు నీరు కొల్లేరుకు ఎగదన్నుతోంది. ఫలితంగా ఈ ప్రాంతంలోని సారవంతమైన లక్ష ఎకరాల భూములు చౌడుబారుతున్నాయి. కొల్లేటి సరస్సులో సహజ సిద్ధంగా పెరిగే నల్లజాతి చేపలైన కొరమేను, ఇంగిలాయి, మట్టగిడస వంటివి ఉప్పునీటికారణంగా వ్యాధుల బారిన పడుతున్నాయి. ఇప్పటి ప్రభుత్వమైనా రెగ్యులేటర్లు నిర్మిస్తే సముద్రపు నీటి నుంచి పొలాలకు రక్షణ లభించి రైతులకు మేలు కలుగుతుంది’’ అని శ్రీనివాసరావు అన్నారు.
 
కొల్లేరు స్వచ్ఛత మా బాధ్యత : మంత్రి నిమ్మల
కొల్లేరు స్వచ్ఛతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ నీటి పారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు బీబీసీతో అన్నారు. ''ఆపరేషన్‌ బుడమేరులో భాగంగా బుడమేరు నుంచి కొల్లేరుకి వెళ్లే వ్యర్థాలను నియంత్రించాలి. కొల్లేరునీటి ప్రవాహాన్ని అడ్డుకునే పూడికలను తొలగించాలి. తద్వారా కొల్లేటి స్వచ్ఛత పెంచాలి. ఆ తర్వాత సముద్రపు నీరు ఎగదన్నకుండా (కొల్లేరులో కలవకుండా) రెగ్యులేటర్‌ నిర్మాణాలపై దృష్టి సారించాలి'' అన్నారు.
 
''ఏలూరు జిల్లాలోని ఉప్పుటేరు వంతెన నుంచి వందమీటర్ల దూరంలోని దుంపగడప వద్ద రెగ్యులేటర్‌ నిర్మాణానికి ప్రతిపాదన ఉంది. కానీ అక్కడ రెగ్యులేటర్‌ నిర్మిస్తే సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ పరిశీలించి రెగ్యులేటర్ల నిర్మాణాలపై మాట్లాడతాం. అంతిమంగా కొల్లేరు స్వచ్ఛతకు, అక్కడి ప్రజల హక్కుల రక్షణకు కట్టుబడి ఉంటాం’’ అని మంత్రి అన్నారు.
 
రెగ్యులేటర్‌ అంటే?
''రెగ్యులేటర్‌ అంటే.. వాటర్‌ లెవల్స్‌ (నీటి స్థాయి)ను క్రమబద్ధీకరించే నిర్మాణం. పెద్ద పెద్ద నదులపై బ్యారేజీలు కట్టినట్టే కాల్వలపై రెగ్యులేటర్‌లు నిర్మిస్తుంటారు. బ్యారేజీల్లో స్టోరేజీకి అవకాశం ఉంటుంది. రెగ్యులేటర్లకు నీటి నిల్వలకు అవకాశం ఉండదు'' అని ఇరిగేషన్‌ మాజీ ఎస్‌ఈ ముక్కామల వెంకట కృష్ణారావు బీబీసీకి తెలిపారు.