శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (13:58 IST)

పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌రింగ్: ఏపీ ప్ర‌భుత్వం ఏం సాధించింది?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చెప్పుకుంటున్న రివ‌ర్స్ టెండ‌రింగ్ విష‌యంలో తొలి అడుగు ప‌డింది. పోల‌వ‌రం ప్రాజెక్ట్ నుంచి దానిని ప్రారంభించారు. ఈ విధానం ద్వారా ప్ర‌భుత్వ ఖ‌జానాకు భారీ ప్ర‌యోజ‌నం చేకూరుతుందని ప్ర‌భుత్వం చెబుతోంది. విప‌క్షం మాత్రం ఈ వాద‌న‌ను తోసిపుచ్చుతోంది. పైగా టెండ‌రింగ్ విధానం లోప‌భూయిష్టంగా ఉంద‌నే ఆరోప‌ణ‌లు చేస్తోంది.

 
వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పోల‌వ‌రం స‌హా అనేక కీల‌క ప్రాజెక్టుల ప‌నుల‌న్నీ నిలిపివేశారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో భారీ అవినీతి జ‌రిగింద‌ని, వాటిపై విచార‌ణ చేసిన త‌ర్వాత మాత్ర‌మే ప‌నులు తిరిగి ప్రారంభిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అందుకు అనుగుణంగానే పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల ప‌రిశీల‌న‌కు ఓ క‌మిటీని నియ‌మించారు. ఆ క‌మిటీ నివేదిక ప్ర‌కారం రూ. 2,500 కోట్ల అవినీతి జ‌రిగింద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దానిని స‌రిచేయ‌డం కోసం రివ‌ర్స్ టెండ‌రింగ్ ప్రారంభిస్తున్న‌ట్టు తెలిపింది.

 
రివ‌ర్స్ టెండ‌రింగ్ తొలిసారిగా
రివ‌ర్స్ టెండ‌రింగ్ విధానాన్ని ఇప్ప‌టి వ‌ర‌కూ రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేప‌ట్ట‌లేదు. కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డిచే కొన్ని సంస్థ‌ల్లో మాత్ర‌మే ఈ ప్ర‌క్రియ చేప‌ట్టారు. అయితే, వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల్లో భాగంగా ఈ విధానం ఏపీలో అమ‌లులోకి వ‌చ్చింది. తొలుత పోల‌వ‌రం ప్రాజెక్ట్ నుంచి మొద‌లుపెట్టారు.

 
పోలవరం ప్రాజెక్టు హెడ్ వ‌ర్క్స్ నుంచి ఎడ‌మ కాలువ‌కు అనుసంధానం చేసే 65వ ప్యాకేజీ ప‌నుల‌కు రివ‌ర్స్ టెండ‌రింగ్ ప‌ద్ధ‌తి నిర్వ‌హించారు. దాని ద్వారా రూ. 58 కోట్ల రూపాయాలు ఆదా చేసిన‌ట్టు ప్ర‌భుత్వం చెబుతోంది. ఆరు సంస్థ‌లు టెండ‌ర్లు దాఖ‌లు చేయ‌గా, అందులో ఎల్ 1 సంస్థ రూ.260.26 కోట్ల‌కు టెండ‌ర్ దాఖ‌లు చేసింది. రూ.274 కోట్ల విలువ చేసే ప‌నుల‌ను 6.1 శాతం త‌క్కువ‌కు పూర్తి చేయ‌డానికి అంగీక‌రించిన ఎల్ 1 క‌న్నా ఎవ‌రైనా త‌క్కువ‌కు చేస్తారా అంటూ రివ‌ర్స్ టెండ‌రింగ్ నిర్వ‌హించారు. దాంతో రూ.231.47 కోట్ల‌తో పూర్తి చేసేందుకు మ్యాక్స్ ఇన్‌ఫ్రా సంస్థ ముందుకొచ్చింది. ఇది అంచ‌నా విలువ క‌న్నా 15.66 శాతం త‌క్కువ. గ‌తంలో నిర్వ‌హించిన టెండ‌ర్‌తో పోలిస్తే ఈసారి రూ.58.53 కోట్ల ప్ర‌జాధ‌నం ఆదా చేసిన‌ట్టు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

 
'రివ‌ర్స్ టెండ‌రింగ్ కాదు.. రిజ‌ర్వుడు టెండ‌రింగ్'
ప్ర‌భుత్వం రివ‌ర్స్ టెండ‌రింగ్ పేరుతో త‌మ‌కు కావాల్సిన వారికి ప‌నులు అప్ప‌గించేందుకు 'రిజ‌ర్వ్‌డ్ టెండ‌రింగ్' అమ‌లు చేసింద‌ని టీడీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఆరోపించారు. "నిబంధ‌న‌లు మార్చేశారు. సాంకేతిక అర్హ‌త‌లు ప‌రిశీలించిన త‌ర్వాత టెండ‌ర్లు ఆహ్వానించాలి. కానీ, దానికి విరుద్ధంగా చేశారు. టెక్నిక‌ల్ బిడ్లు తెర‌వ‌కుండా ఫైనాన్సియ‌ల్ బిడ్లు తెర‌వ‌డం అనేది గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో కూడా జ‌ర‌గ‌లేదు. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల్ని, సాంకేతిక నిపుణుల‌ను కూడా సంప్ర‌దించ‌కుండా ఏక‌ప‌క్షంగా ఈ ప్ర‌క్రియ సాగిస్తున్నారు. కేంద్ర విజిలెన్స్ క‌మిష‌న్ నివేదిక‌ల‌ను తుంగ‌లో తొక్కారు. ఆ ప్రాజెక్టుకు ఏమైనా అయితే గోదావ‌రి జిల్లాల్లో ఒక్క గ్రామం కూడా మిగ‌ల‌దు. అయినా, జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఇవేమీ ప‌ట్ట‌డం లేదు" అని చంద్రబాబు అన్నారు.

 
హెడ్ వ‌ర్క్స్, ప‌వ‌ర్ స్టేష‌న్ ఒకే టెండ‌ర్‌
తాజాగా కీల‌క‌మైన హెడ్ వ‌ర్క్స్, ప‌వ‌ర్ స్టేష‌న్ ప‌నుల‌కు టెండ‌ర్లు పిలిచారు. రూ. 4,987.55 కోట్ల విలువచేసే ప‌నుల‌కు టెండర్లు పిలువగా.. 12.6 శాతం తక్కువ మొత్తానికే ఈ పనులు చేపట్టేందుకు 'మేఘా' సంస్థ ముందుకొచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది.

 
ఈ పనుల కోసం రూ. 4,358.11 కోట్లు కోట్‌ చేస్తూ.. మేఘా సంస్థ బిడ్డింగ్‌ వేసింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 628.43 కోట్లు ఆదా అవుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు, గతంలో 4.8 శాతం అధిక ధరకు కాంట్రాక్టు ఇవ్వ‌డం వ‌ల్ల‌ ప్రభుత్వానికి రూ. 154 కోట్ల అదనపు భారం పడిందని, ఇప్పుడు ఆ భారం కూడా తగ్గడంతో ప్ర‌భుత్వానికి మొత్తం రూ. 782 కోట్లు ఆదా అయినట్టు అధికారులు చెప్పారు.

 
పోల‌వ‌రం ప్రధాన డ్యాం వద్ద మిగిలిన రూ. 1,771.44 కోట్ల పనుల కోసం, 960 మెగావాట్ల జలవిద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రూ. 3,216.11 కోట్ల విలువైన పనులకు టెండ‌ర్లు నిర్వ‌హించారు. ఈ రెండు ప‌నుల‌కు క‌లిపి ఒక‌టే బిడ్ దాఖ‌ల‌య్యింది. మేఘా సంస్థ త‌రఫున ఈ బిడ్ దాఖ‌లు చేశారు.

 
చరిత్ర సృష్టించాం..ప్ర‌జాధ‌నం ప‌రిర‌క్షించాం’
రివ‌ర్స్ టెండ‌రింగ్ విధానం ద్వారా దేశంలోనే తొలిసారిగా పార‌ద‌ర్శ‌క విధానాల‌కు శ్రీకారం చుట్టామ‌ని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

 
ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ... "అధికారంలోకి రాక‌ముందు, సీఎంగా ప్ర‌మాణ స్వీకారం సమయంలో ముఖ్య‌మంత్రి చెప్పిన మాట‌ల‌కు అనుగుణంగా అడుగులు వేస్తున్నాం. రివ‌ర్స్ టెండ‌రింగ్ ద్వారా రూ.800 కోట్ల‌కు పైగా ఆదా చేశాం. ప్ర‌జ‌ల సొమ్ముకి జ‌వాబుదారీగా వ్య‌వ‌హ‌రిస్తున్నాం. పోల‌వ‌రం రివ‌ర్స్ టెండ‌ర్ల‌తో చిత్త‌శుద్ధి నిరూపించుకున్నాం. ఇకపై ఇదే విధానాన్ని సాగునీటి ప్రాజెక్టులతో పాటు, రోడ్లు భవనాలు, మున్సిపల్ శాఖల్లోనూ అన్ని పనులకూ అమ‌లు చేస్తాం. టీడీపీ నేత‌ల విమ‌ర్శ‌ల‌కు అర్థం లేదు. ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్న‌మే త‌ప్ప ఇంకేమీ లేదు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో 4.77శాతం అదనపు ధరకు పనులు అప్పగించిన సంస్థ‌కే, ఇప్పుడు 15.6 త‌క్కువకు కాంట్రాక్టు ఇవ్వ‌డం చూసిన త‌ర్వాతైనా వారు అబ‌ద్ధపు ప్ర‌చారం మానుకోవాలి" అని అన్నారు.

 
నాణ్యతను తాకట్టు పెట్టి, వందల కోట్లు ఆదా చేశామని ప్రచారం’
గత ప్రభుత్వం మీద బురద జల్లాలన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రివర్స్ టెండరింగ్‌ చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. "ఆగస్టు 16న ఈ ప్రభుత్వం జీవో నెం.67 జారీ చేసింది. అందులోని సెక్షన్ 15 ప్రకారం, కనీసం రెండు సంస్థలు పాల్గొంటేనే... రివర్స్‌ టెండరింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు. కానీ, ఇప్పుడు కేవ‌లం ఒక్క సంస్థే బిడ్ దాఖ‌లు చేసిన‌ప్ప‌టికీ ప్ర‌క్రియ పూర్త‌యిన‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. గతంలో కంటే, మైనస్ 26 శాతం ఖర్చుతో డ్యామ్ నిర్మాణం చేస్తుంటే నాణ్యత ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. పనుల నాణ్యతను తాకట్టు పెట్టి, వందల కోట్లు ఆదా చేశామని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. మా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను తుంగలో తొక్కారు. టర్బైన్లకు బదులుగా లిఫ్ట్ ఇరిగేషన్ పైపు లైన్‌ల పేరుతో బిడ్స్ ఆహ్వానించారు. పనుల పూర్తికి గడువును పొడిగించారు. ఈ ఆలస్యం వల్ల సంవత్సరానికి పది వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది" అని దేవినేని ఉమ అన్నారు.

 
రివ‌ర్స్ టెండ‌రింగ్ అంటే ఏమిటి?
ప్ర‌భుత్వం ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వివిధ కాంట్రాక్టు సంస్థ‌ల ద్వారా చేయించ‌డానికి టెండ‌ర్లు పిలుస్తుంటుంది. భిన్న‌మైన ప‌ద్ధ‌తుల్లో టెండ‌ర్లు ఉంటాయి. ఓపెన్ టెండ‌ర్, బిడ్డింగ్ స‌హా ప‌లు ప‌ద్ధ‌తులు అవ‌లంభిస్తారు. ఇటీవ‌ల ఆన్ లైన్‌లో టెండ‌ర్లు నిర్వ‌హిస్తున్నారు. ఒక‌సారి ఒక ప్రాజెక్ట్ కాంట్రాక్టుని ఏదైనా సంస్థ‌కు అప్ప‌గించిన త‌ర్వాత ఏకార‌ణంతో సంతృప్తి చెంద‌క‌పోతే పాత టెండ‌ర్లు ర‌ద్దు చేసే అధికారం ప్ర‌భుత్వానికి ఉంటుంది.

 
మ‌ళ్లీ టెండ‌ర్లు పిల‌వ‌డానికి ఏ విధానాన్ని అయినా ఎంచుకునే స్వేచ్ఛ‌ కూడా ఉంటుంది. కానీ, పాత ప‌ద్ధ‌తిలోనే, అదే కాంట్రాక్టుని, అంత క‌న్నా త‌క్కువ‌కు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించి మ‌ళ్లీ టెండ‌ర్లు పిల‌వ‌డాన్ని రివ‌ర్స్ టెండ‌రింగ్ అంటారు. మొద‌టి సారి పిలిచిన టెండ‌ర్ల‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌నే నిర్ధర‌ణ‌కు రావ‌డం లేదా ఆ ప‌నిని మ‌రింత చౌక‌గా నిర్వ‌హించ‌డానికి అవ‌కాశాలున్నాయ‌నే అభిప్రాయానికి రావ‌డంతోనే రివ‌ర్స్ టెండ‌రింగ్‌కు పిలుస్తారు.