మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: శనివారం, 29 జూన్ 2019 (13:45 IST)

ఆరెంజ్ జెర్సీల్లో 'మెన్ ఇన్ బ్లూ'... ఇంగ్లాండును అదరగొడతారా?

ఆదివారం ఇంగ్లండ్-భారత్ మధ్య జరిగే మ్యాచ్‌లో టీమిండియా అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తనుంది. ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం నుంచీ మెన్ ఇన్ బ్లూ ఆరెంజ్ జెర్సీ ఎప్పుడు వేసుకుంటారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సీక్రెట్‌గా ఉంచిన ఈ జెర్సీ ఎలా ఉంటుందా అనుకున్నారు. ఈ జెర్సీని కోహ్లీ సేన ఆదివారం ధరించబోతున్నారని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ అపరెల్ పార్ట్‌నర్ నైకీ ఇండియా.. భారత జట్టు కొత్త జెర్సీ ఫొటోలను విడుదల చేసింది.
 
బీసీసీఐ కూడా టీమిండియా ఆదివారం ధరించబోయేది ఈ జెర్సీలే అని ధ్రువీకరించింది. ఈ ఆరెంజ్ జెర్సీలను ఆటగాళ్లకు సున్నితంగా ఉండేలా ప్రత్యేకంగా రూపొందించారు. మైదానంలో ఉన్నప్పుడు చెమట వల్ల ఇబ్బంది రాకుండా దీనిలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మీడియా సమావేశంలో నైకీ ఇండియా ప్రతినిధులు చెప్పారు. ఇది తేలిగ్గా, సౌకర్యంగా ఉంటుందన్నారు.
 
మెన్ ఇన్ ఆరెంజ్ జెర్సీ...
ఐసీసీ అన్ని దేశాల ఆటగాళ్లు తమ రెండు రంగుల కిట్‌లు అందుబాటులో ఉంచుకోవాలని ఒక లేఖ రాసింది. దీంతో బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్ఘానిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు ప్రధాన రంగు జెర్సీతోపాటూ ప్రత్యామ్నాయ జెర్సీకి సంబంధించిన కిట్లు కూడా తెచ్చుకున్నాయి. న్యూజీలాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా వేరే రంగు జెర్సీలు వేసుకున్నట్లు ఇప్పటివరకూ కనిపించలేదు. ఎందుకంటే వేరే జట్ల జెర్సీల్లో అలాంటి రంగులు లేకపోవడంతో వాటికి ప్రత్యామ్నాయ జెర్సీ ధరించాల్సిన అవసరం లేకుండా పోయింది.
 
ప్రేక్షకులకు కన్‌ఫ్యూజన్ లేకుండా...
ఐసీసీ రూల్స్ ప్రకారం బ్లూ, గ్రీన్ జెర్సీలు ఉన్న వారు మాత్రమే ప్రత్యామ్నాయ జెర్సీలు ధరించాలి. కానీ, వరల్డ్ కప్‌ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే దేశానికి మాత్రం ఒకే రంగు జెర్సీ ధరించడానికి అనుమతి ఉంటుంది. అంటే ప్రస్తుతం ఇంగ్లండ్ మాత్రమే ఒకే రంగు జెర్సీలను ధరించవచ్చు.
 
ఇలా రెండు జెర్సీల పద్ధతిని ఫుట్‌బాల్ మ్యాచుల్లో ఉపయోగిస్తారు. రెండు టీమ్స్ జెర్సీలు ఒకేలా ఉంటే ప్రేక్షకులు గందరగోళానికి గురికాకుండా ఇలాంటి పరిష్కారం ఆలోచించారు.
 
ఐసీసీ ఆరెంజ్‌కు దగ్గరగా ఉండే రంగుల జెర్సీలు ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలని ఐసీసీకి సూచించింది. కానీ బీసీసీఐ ఆరెంజ్ రంగును మాత్రమే ఎంపిక చేసిందని తెలుస్తోంది. క్రికెట్‌లో దక్షిణాఫ్రికా జట్టు మామూలు గ్రీన్ జెర్సీతోపాటు, పింక్ జెర్సీ ఉపయోగిస్తోంది. ఈ జెర్సీని బ్రెస్ట్ కాన్సర్‌పై అవగాహన ప్రచారానికి మద్దతుగా ఉపయోగిస్తున్నారు.
 
ఐపీఎల్ టోర్నీలో కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రెండు రకాల జెర్సీలను ఉపయోగించడం మనం చూశాం. కోహ్లీ సేన రెడ్, గ్రీన్ జెర్సీలతో రంగంలోకి దిగింది.