గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By మోహన్
Last Updated : గురువారం, 27 జూన్ 2019 (18:16 IST)

మరో రికార్డ్ నెలకొల్పిన విరాట్ కోహ్లీ.. అత్యంత వేగంగా 20వేల పరుగులు

ప్రపంచ క్రికెట్‌లో పరుగుల యంత్రంగా, రికార్డ్‌ల రారాజుగా వెలుగొందుతున్న విరాట్ కోహ్లీ మరో ప్రపంచ రికార్డ్‌ను అందుకున్నాడు. విండీస్‌తో జరుగుతున్న మ్యాచ్ ద్వారా కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 20 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. భారత్ ఇన్నింగ్స్‌లో విండీస్ ఫేసర్ హోల్డర్ వేసిన 25వ ఓవర్‌లో నాలుగో బంతికి సింగిల్ తీసిన కోహ్లీ ఈ రికార్డ్‌ను అందుకున్నాడు.
 
దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 20 వేల పరుగులు పూర్తి చేసిన 12వ బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. కాగా భారతీయ బ్యాట్‌మెన్‌ల వరుసలో మూడో వ్యక్తిగా నిలవడం మరో విశేషం. భారతీయ బ్యాట్స్‌మెన్‌లలో కేవలం సచిన్ టెండుల్కర్(34,357), రాహుల్ ద్రవిడ్‌(24,208) మాత్రమే ఈ రికార్డ్‌ను సాధించారు. తాజాగా కోహ్లీ వారి సరసన చేరాడు.
 
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 417 ఇన్నింగ్స్ ఆడాడు. టెస్టుల్లో 131‌, వన్డేల్లో 224, టీ20ల్లో 62 ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే విశేషం ఏమిటంటే కోహ్లీ అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ రికార్డ్‌ను నెలకొల్పింది మాత్రం కోహ్లీనే. సచిన్, లారా 453 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకోగా, ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్ 468 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డ్‌ను సాధించాడు.